నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రి సిబ్బంది నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమాని కొడుకు పెళ్లికి వెళుతూ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అనంతరం ఆసుపత్రికి తీసుకువచ్చాక నందమూరి హరికృష్ణ మృతి చెందారు. ఆ భౌతికకాయంతో ఆసుపత్రి సిబ్బంది పలువురు సెల్ఫీ దిగడం వివాదాస్పదమైంది. హరికృష్ణ మృతదేహంతో ఇద్దరు డ్యూటీ నర్సులు, ఒక వార్డు బాయ్, మరో వార్డ్ గర్ల్ కలిసి నవ్వుతూ సెల్ఫీ దిగటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆస్పత్రి సిబ్బంది చర్య పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణాలు కాపాడాల్సింది పోయి మృతదేహాల వద్ద కూడా ఇంత పిచ్చిగా వ్యవహరించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కామినేని ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. హరికృష్ణ భౌతికకాయం వద్ద సెల్ఫీ దిగిన వారిపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే తాజాగా, తీవ్రంగా గాయపడిన హరికృష్ణతో సెల్ఫీలు దిగిన ఆస్పత్రి సిబ్బందిని కామినేని ఆసుపత్రి యాజమాన్యం సస్పెండ్ చేసింది. విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో యాజమాన్యం స్పందించి వారిపై వేటు వేసింది.