నందమూరి హరికృష్ణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్థలాన్నికేటాయించింది. అంత్యక్రియలు ముగిశాక కుటుంబసభ్యుల నిర్ణయం మేరకు స్మారక చిహ్నం నిర్మించే అవకాశం ఉంది. ఆయన అంత్యక్రియలను మొయినాబాద్‌లో ఫాం హౌస్‌లో నిర్వహించాలని కుటుంబసభ్యులు అనుకున్నారు.
హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరాం అంత్యక్రియలు కూడా ఇక్కడే నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని చెప్పడంతో వేదికను మార్చారు. మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన కుటుంబసభ్యులు ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించారు. మరో పక్క, హరికృష్ణ అంతిమ సంస్కారాలు ముగిసాయి. హరికృష్ణ చితికి రెండో కుమారుడు కల్యాణ్‌రామ్ నిప్పంటించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, హరికృష్ణ సోదరులు జయకృష్ణ, బాలకృష్ణ, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తదితరులు మహాప్రస్థానానికి చేరుకుని హరికృష్ణ పాడెను మోశారు.
తొలుత మెహదీపట్నం నుంచి మహాప్రస్థానం వరకూ సాగిన అంతిమయాత్రలో సినీ, రాజకీయ ప్రముఖులు, తెదేపా శ్రేణులు, నందమూరి అభిమానులు భారీగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ మంత్రులు నారా లోకేష, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు హరికృష్ణ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి హరికృష్ణ పార్థీవదేహాన్ని కడసారి తిలకించి అశ్రునయనాల నడుమ కన్నీటి వీడ్కోలు పలికారు.