పార్లమెంట్ లో మొన్న మనం గల్లా ఇంగ్లీష్ లో, రామ్మోహన్ నాయుడు హిందీలో, ఢిల్లీ పాలకుల పై విరుచుకుపడటం చూసాం.. కాని, 2013లో స్వచ్చమైన తెలుగులో, హరికృష్ణ ఢిల్లీ పాలకుల పై విరుచుకుపడిన తీరు, చాలా కొద్ది మందికే గుర్తుండి ఉంటుంది. తెలుగుభాష ప్రాచుర్యాన్ని ఖండాంతరాలకు చాటిచెప్పిన దివంగత నేత ఎన్టీ రామారావుకు తగ్గ తనయుడిగా హరికృష్ణ భాషాభిమానాన్ని అనేక సందర్భాల్లో చాటుకున్నారు. రాజ్యసభలో సైతం ఆసాంతం తెలుగులోనే ప్రసంగాన్ని కొనసాగించి రాజకీయ ఉద్ధండులను సైతం ఔరా అనిపించారు. రాష్ట్ర విభజనపై రాజ్య సభలో చర్చకు వచ్చిన సందర్భంలో తెలుగులోనే ప్రసంగిస్తానని తేల్చి చెప్పారు.

hari 30082018

అయితే దీనిపై నాటి రాజ్యసభ ఉపసభాపతి కురియన్ అభ్యంతరం వ్యక్తంచేస్తూ ముందుగా అనుమతి తీసుకోవాలని, అనుమతి తీసుకుంటే అనువాదకులను నియమించే వారమని వారిస్తున్నా ఉద్విగ్నభరితంగా మాట్లాడుతూ ‘ తెలుగుప్రజలను విడదీసే చర్చ’లో మాట్లాడటం బాధాకరంగా ఉందని ప్రసంగాన్ని ప్రారంభించారు. దీనిపై ఉపసభాపతితో సహా పలువురు సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ట్రాన్స్‌లేషన్ అని కురియన్ ఉటంకించిన పదానికి స్పందిస్తూ ట్రాన్స్‌లేషన్ కాదని ఎక్స్‌ప్రెషన్ ముఖ్యమని హరికృష్ణ స్పష్టంచేశారు. దీంతో మీరు మాట్లాడేది నాకైనా అర్థం కావాలి కదా అని కురియన్ స్పందించారు. ఈ క్రమంలో నాటి రాజ్యసభ సభ్యుడు, నేటి ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు కలుగజేసుకుని ఏ భాషలో మాట్లాడాలో ఆదేశించే అధికారం సభాపతులకు లేదని వివరించారు.

hari 30082018

దీంతో హరికృష్ణ ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘తాంబాలులిచ్చాం..తన్నుకు చావమంటారా’ అని యూపీఏ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక తండ్రికి పుట్టిన బిడ్డలకు సమాన న్యాయం చేయకుండా అన్యాయం చేస్తారా’ తెలుగు ప్రజలంటే అంత చులకనా.. ఎవరినడిగి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు.. రెండు ప్రాంతాల ప్రజల మనోభావాలు తెలుసుకున్నారా.. రాజకీయ లబ్ధి కోసం ప్రాంతాల మధ్య చిచ్చుపెడతారా అని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనతో ఏం సాధించాలనుకున్నారో తేల్చాలని పట్టుపట్టారు. అధికారం ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దలు చేస్తున్న కుయుక్తులకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా భాషాభిమాన కుటుంబంలో జన్మించిన హరికృష్ణ మాతృభాషా దినోత్సవం రోజునే ఆకస్మిక మృతిచెందడం పట్ల తెలుగు ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.

 

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read