ఈవీఎంలపై పలు రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పనితీరు ఎంత లోపభూయిష్టంగా ఉందో ఓవైపు సీఎం చంద్రబాబునాయుడు ఎలుగెత్తి చెబుతుండగా, అదే సమయంలో వీవీ ప్యాట్లో ఉండాల్సిన ఓటర్ రసీదు నెల్లూరులోని ఓ కాలేజి వద్ద పడివుండడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ సాంకేతిక నిపుణుడు, ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు హరిప్రసాద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "నెల్లూరులోని ఓ జూనియర్ కాలేజీ వద్ద ఎవరో ఈ ఓటర్ రసీదును చూశారు. ఇది మాక్ పోలింగ్ సందర్భంగా తీసిన రసీదు అయ్యుంటుందా? అయితేమాత్రం, వీవీ ప్యాట్ నుంచి వచ్చిన ఎలాంటి రసీదునైనా భద్రపరచాల్సిన అవసరంలేదా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?" అంటూ మండిపడ్డారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి సాయపడేందుకు ఎంతోమంది విజిల్ బ్లోయర్లు సిద్ధంగా ఉన్నారని, అలాంటి వాళ్లను వేధించే బదులు రక్షణ కల్పిస్తే చాలని హరిప్రసాద్ తన ట్వీట్ లో విజ్ఞప్తి చేశారు. కాగా, ఆ ఓటర్ రసీదులో వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతంరెడ్డి పేరు, ఫ్యాన్ గుర్తు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 11న ఏపీలో పోలింగ్ జరిగింది. ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో 133, 134 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్ కేంద్రాలలో వీవీ ప్యాట్ స్లిప్స్ దొరికాయి. స్లిప్స్ బయటకు రావడంతో ఆర్డీవో, రెవెన్యూ సిబ్బంది షాక్ తిన్నారు. వెంటనే వాటిని సేకరించడం మొదలు పెట్టారు. వాటన్నింటిని కాల్చే ప్రయత్నం చేశారు. మీడియాలో ప్రసారం చేయొద్దని సిబ్బంది వేడుకున్నారు. నిబంధనల ప్రకారం స్లిప్పులను భద్రపరచాలి. సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సిబ్బంది తీరుపై విమర్శలు వస్తున్నాయి.
అయితే, స్లిప్పుల కలకలం అంశాన్ని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు దృష్టికి మీడియా తీసుకెళ్లింది. పోలింగ్ కు ముందు ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్ లో భాగంగా ఈవీఎం ద్వారా 50 ఓట్లు వేస్తారు. ఓట్లు కరెక్ట్ గా పడుతున్నాయా లేదా, ఒక గుర్తుకి ఓటు వేస్తే మరో గుర్తుకి ఓటు పడిందా, ఎన్ని ఓట్లు ఒక గుర్తుకి వెయ్యడం జరిగింది.. ఇలా అన్ని లెక్కలు రాసుకుంటారు. వీవీ ప్యాట్ స్లిప్స్ ప్రకారం ఈవీఎం పనితీరు పరిశీలిస్తారు. ఆ సమయంలో తీసిన వీవీ ప్యాట్ స్పిప్స్ ను సిబ్బంది భద్రపరచాలి. అందుకు విరుద్ధంగా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయితే ఈ స్లిప్స్ మాక్ పోలింగ్ కు సంబంధించినవా, లేక ఓటింగ్ జరిగిన తర్వాత వీవీ ప్యాట్ నుంచి బయటకు తీశారా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై దర్యాఫ్తు జరుగుతోంది. ఈ విషయం ఏపీ సీఈవో ద్వివేది దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు. నివేదిక సమర్పించాలని అన్నారు.