ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని మరోసారి ప్రభుత్వం తరుపు న్యాయవాదులు ఇరిటేట్ చేసిన సంఘటన ఇది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేక సందర్భాల్లో ప్రభుత్వ అధికారుల పై, ప్రభుత్వ న్యాయవాదులు పై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అనేక సార్లు ఇదే జరిగినా, ప్రభుత్వ అధికారాల్లో మార్పు కనిపించటం లేదు. డీజీపీ దగ్గర నుంచి, చీఫ్ సెక్రటరీ, ప్రినిసిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు, ఇతర ఉన్నాతధికారులను హైకోర్టు కోర్టుకు పిలిచినా, కొంత మంది పైన కోర్టు ధిక్కరణ పిటీషన్లు వేసినా , కొంత మందికి శిక్షలు వేసినా కూడా, అధికార వర్గాల్లో మార్పు కనిపించటం లేదు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఇలా చేస్తున్నారా, లేక అధికారులే ఇలా అవగాహనలేక చేస్తున్నారో కానీ, హైకోర్ట్ చేతిలో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు ఇలాంటి సంఘటన మరొకటి జరిగింది. ప్రభుత్వ స్కూల్స్ ఉన్న ప్రాంగణంలో, గ్రామ సచివాలయాలు, అలాగే రైతు భరోసా కేంద్రాలు ఇలా అనేక, భవనాలు కడుతూ ఉండటంతో, గతంలో హైకోర్టు ఈ అంశం పై ఆదేశాలు ఇస్తూ, ఆ భవనాలు వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు అమలు కాక పోవటంతో, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీని పైన సుమోటోగా కేసు నమోదు చేసి, కోర్టు ధిక్కరణ కింద కేసు బుక్ చేసింది.
ఈ కేసు నిన్న విచారణకు వచ్చింది. హైకోర్టు సీనియర్ న్యాయవాది బట్టు దేవానంద్ బెంచ్ ముందుకు ఈ పిటీషన్ రాగా, నిన్న విచారణ జరిగింది. అయితే విచారణ సందర్భంలో, హైకోర్టు అడిగిన సమాచారం ఇవ్వకుండా, వేరే సమాచారం ఇవ్వటంతో హైకోర్టు ఆశ్చర్య పోయింది. ప్రభుత్వ స్కూల్స్ ప్రాంగణంలో, గ్రామ సచివాలయ భావనలను తొలగింపునకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాల్సిందిగా, హైకోర్టు కోరగా, ఇద్దరు అధికారుల మధ్య జరిగిన సంభాషణ ఫైల్ ని, కోర్టు ముందు ఉంచారు. దీంతో హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఫైల్స్ కోర్టు ముందు పెడితే ఉపయోగం ఏమిటి అని ? మిమ్మల్ని ఏమి అడిగాం, మీరు ఏమి ఇచ్చారు అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఫైల్స్ మా ముందు పెట్టి, మమ్మల్ని భ్రమింపచేస్తున్నారా అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించింది. వీటి కోసం మళ్ళీ వేల పేజీల జిరాక్స్ తో ప్రజాధనం నిరుపయోగం చేసారని, వెంటనే వాస్తవ రిపోర్ట్ ఇవ్వాలని చెప్తూ, కేసుని 15వ తేదీకి వాయిదా వేసింది.