ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై, హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ని సార్లు చెప్పినా నరేగా బిల్లులు చెల్లించక పోవటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే కాకుండా, రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించిన సుమారు 500 మంది పిటీషనర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. పైగా వీరి అందరికీ కూడా రెండు వారల లోపు బిల్లులు చెల్లించి తీరాలి అంటూ, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. బిల్లులు చెల్లించకపోవటం వల్ల కాంట్రాక్టర్లు ఎవరు అయితే పనులు చేసారో, వాళ్ళు రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 21 ప్రకారం, జీవించే హక్కు కోల్పోతున్నారని, జీవించే హక్కు అంటే, గౌరవంతో జీవించటం అనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని కోర్టు పేర్కొంది. దీంతో పాటుగా, గతంలో అడ్వొకేట్ జనరల్ మాట్లాడుతూ, ఈ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఈ రోజు వరుకూ చెల్లించలేదని, కోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ కేసు విచారణను వాయిదా వేసుకునే మార్గం చూస్తుంది కానీ, బిల్లులు చేలించే మార్గాన్ని చూడటం లేదని, హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీంతో పాటు, ఈ బిల్లులు తాము ఇప్పటికే 70 మందికి చెల్లించామని, బిల్లులు చెల్లింపులకు సంబంధించి, ఇప్పటికే వారి ఎకౌంటుకు పంపామని కోర్టుకు ప్రభుత్వం చెప్పిన సమయంలో, కోర్టు ఆగ్రహించింది.
ఎవరెవరికి బిల్లులు చెల్లించారో, ఎంత చెల్లించారో చెప్పమని అడిగినా, ఎందుకు సమాచారం ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంలో కల్పించుకున్న పిటీషనర్ తరుపు న్యాయవాదులు, తమకు ఎవరికీ కూడా బిల్లులు చెల్లించలేదని, ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తుందని కోర్టు కు తెలిపారు. దీంతో న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బిల్లులు చెల్లించటం అంటే, పంచాయతీ ఎకౌంటు కు బిల్లులు ఇవ్వటం కాదు, ఎవరు అయితే కాంట్రాక్టులు చేసారో, వారి ఎకౌంటుకు బిల్లులు ఇవ్వాలి, ఆ వివరాలు తమకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసారు. అదే విధంగా బిల్లులు పెండింగ్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉండటంతో, ఈ బిల్లులకు వడ్డీతో పాటుగా, అదే విధంగా 20 శాతం వరకు బిల్లులు మినహాయిస్తున్నారో, దీని పై తుది తీర్పు ఇచ్చే సమయంలో, తగిన ఆదేశాలు ఇస్తామని కోర్టు చెప్పింది. అదే విధంగా నేరగా నిధులు కేంద్రం ఇవ్వాల్సిన 75 శాతం దాదపుగా 1900 కోట్లు , ఇప్పటికే తాము చెల్లించామని కోర్టుకు తెలిపారు. రెండు వారాల్లో బిల్లులు చెల్లించాల్సిందే అని కోర్టు చెప్తూ, రెండు వారాలకు వాయిదా వేసింది. మరి రెండు వారాల్లో ప్రభుత్వం అన్ని డబ్బులు ఎలా కట్టాలి అనే టెన్షన్ లో పడింది.