ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వెబ్సైటులో జీవోలు పెట్టక పోవటం పై, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన పలువురు పిటీషన్లు దాఖలు చేసారు. దాని పైన ఈ రోజు హైకోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో భాగంగా, ప్రభుత్వం ప్రస్తుతం జీవోలు పెడుతున్న ఈ-గజిట్ లో కూడా పూర్తి స్థాయిలో జీవోలను ఉంచటం లేదని, కేవలం నాలుగు నుంచి అయుదు శాతం మాత్రమే జీవోలను అక్కడ ఉంచుతున్నారని, పిటీషనర్ తరుపు న్యాయవాది ఎలమంజుల బాలాజీ హైకోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ప్రభుత్వం కావాలనే ఇలా చేస్తుందని, నిబంధనలకు విరుద్ధంగా, చాలా జీవోలు అందులో ఉంచకుండా వ్యవహరిస్తుందని వాదించారు. ప్రభుత్వ తీరు సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకమని న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వ తరుపు న్యాయవాది మాత్రం, సీక్రెట్, టాప్ సీక్రెట్ అని కొన్ని జీవోలు ఉంటాయని, అలాంటి జీవోలను మత్రమే తాము వెబ్సైటులో ఉంచటం లేదని, మామూలు జీవోలు అన్నీ కూడా వెబ్సైటులో పెట్టామని, ప్రభుత్వం తరుపు న్యాయవాది, హైకోర్టుకు తెలిపారు. కేవలం రహస్య జీవొలనే బయట పెట్టలేదని తెలిపారు.
దీని పైన స్పందించిన హైకోర్టు, అసలు సీక్రెట్, టాప్ సీక్రెట్ అని ఏ ప్రాతిపదికిన దాన్ని విభాజిస్తారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే ప్రస్తుతం అసలు ఎన్ని జీవోలను విడుదల చేసారని, ఎన్ని రహస్యంగా ఉంచరాని, ఈ విషయాలు అన్నీ పూర్తి వివరాలతో తమకు అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు. అసలు సాఫీగా జరిగే ప్రక్రియకు ఎందుకు ఆటంకం కల్పించారని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తీ వివరాలు తమకు ఇవ్వాలని హైకోర్టు తెలుపుతూ, తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసు వివరాలు చూస్తే, ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలు జీవోల రూపంలో ఇస్తారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వం ఎవరికైనా పని అప్పగించినా, ఎవరికైనా రూపాయి ఖర్చు పెట్టినా సరే, అది జీవో రూపంలో వస్తుంది. ఇవన్నీ మొన్నటి వరకు ప్రజలకు అందుబాటులో ఉండేవి. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం, ఈ జీవోలను ఇక పెట్టం అని, ఏది అయినా ఆఫ్ లైన్ లోనే ఇస్తామని చెప్పింది. తరువాత గజెట్ రూపంలో ఇస్తామని చెప్పినా, అన్నీ బయటకు రావటం లేదు.