తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ప్రజాకూటమి అభ్యర్థి రేవంత్ రెడ్డిని అక్రమంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకువెళ్ళారో చెప్పకోవటం పై ఈ మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరిగింది. కేసీఆర్ పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారని, శాంతిభద్రతల దృష్ట్యా ఆయనను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బంద్‌కు రేవంత్ పిలుపునిస్తే తప్పేంటని, ఆయనను అదుపులోకి తీసుకొని ఏ నేరాన్ని నియంత్రించారని పోలీసులను ప్రశ్నించింది. నిఘావర్గాల సమాచారం మేరకే తాము రేవంత్ రెడ్డిని ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
అయితే ఇంటెలిజెన్స్ అందించిన నివేదికను, ఆధారాలు సమర్పించాలని హైకోర్ట్ పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనలో పోలీసుల తీరు పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ అరెస్టుకు కారణాల పై ఆధారలను ఈ రోజే కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను సాయంత్రం 3.45 గంటలకు వాయిదా వేసింది. ఈ విచారణకు అడ్వొకేట్ జనరల్ హాజరుకావాలని ఆదేశించింది. రేవంత్‌రెడ్డి అరెస్ట్‌పై హైకోర్టులో కాంగ్రెస్ నేత వేం నరేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రేవంత్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆయన హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ కోరారు. దీంతో విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం పైవిధంగా వ్యాఖ్యలు చేసింది.
రేవంత్ రెడ్డి అరెస్ట్ పై, సీఈవో రజత్ కుమార్ మాట్లాడుతూ.. రేవంత్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు..? ఎవరు అరెస్ట్ చేశారు? అనే విషయంపై వివరణ ఇచ్చారు. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ రోజు కొడంగల్‌లో బంద్‌కు పిలుపిచ్చామని ఈ నెల 2న కాంగ్రెస్ పార్టీ స్టేట్‌మెంట్ ఇచ్చిందన్నారు. దీనిపై టీఆర్ఎస్ మాకు ఫిర్యాదు చేసిందని రజత్ కుమార్ తెలిపారు. ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపామని.. వారి ఆదేశాలపై ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారికి లేఖ రాశామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందుజాగ్రత్తలో భాగంగా రేవంత్‌ను అరెస్ట్ చేశారని సీఈవో స్పష్టం చేశారు. కొడంగల్‌లోనే శాంతి భద్రతల సమస్య ఉందని సీఈవో చెప్పుకొచ్చారు. అయితే ఇదే విషయం తెలంగాణా ప్రభుత్వం కోర్ట్ కి చెప్పటంతో, కోర్ట్ అక్షింతలు వేసింది.