ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టిటిడి ప్రత్యేక ఆహ్వానితుల జాబితా పై, ఈ రోజు విచారణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక ఆహ్వానితులను నియమించటం, ఆగమ శాస్త్రానికి, చట్టానికి కూడా విరుద్ధం అని, తిరుపతికి చెందిన బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి వేసిన పిటీషన్ పైన, ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా , ఆయన తరుపున న్యాయవాది అశ్వినీ కుమార్ వాదనలు వినిపించారు. ఒకసారి ప్రత్యేక ఆహ్వానితుల జాబితాను హైకోర్టు కొట్టి వేయిగా, దాని పైన విచారణ జరుగుతున్న సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానితులను నియమించుకునేందుకు, ప్రత్యేక అధికారం ఉందని చెప్పి, ఆర్డినెన్స్ తీసుకుని వచ్చిందని, ఒక పక్క హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో ఆర్డినెన్స్ తీసుకుని రావటం అనేది, మోసానికి పాల్పడినట్టే అవుతుందని, ఆయన వాదనలు వినిపించారు. ఈ నేపధ్యంలో, హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం జోక్యం చేసుకుని, కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు, పైగా తుది నిర్ణయం ఇంకా కోర్టు ప్రకటించని సందర్భంలో, మీరు ఆర్డినెన్స్ ఎలా తీసుకుని వస్తారు అంటూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీని పైన మేము నిర్ణయాన్ని వెలువరిస్తామని, హైకోర్టు తీవ్ర ఆగ్రహంతో నిర్ణయం ప్రకటించబోయింది.
ఈ సందర్భంలో అడ్వొకేట్ జనరల్ జోక్యం చేసుకున్నారు. అడ్వొకేట్ జనరల్ జోక్యం చేసుకుని, ఈ ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వానికి అధికారం వచ్చినప్పటికీ కూడా, ఈ ఆర్డినెన్స్ ను ఆధారంగా చేసుకుని, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎవరినీ నియమించుకోమని, ఇందులో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తప్ప, ఎవరూ కూడా పాలక మండలి సమావేశానికి కూడా వెళ్ళరు అని కూడా హైకోర్టు హామీ ఇస్తూ స్పష్టం చేసారు. అయితే ఈ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకోవచ్చు అని కూడా అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఈ సమయంలో, హైకోర్ట్ లో భాను ప్రకాష్ తరుపు న్యాయవాది అశ్వినీ కుమార్ జోక్యం చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు, ఒక జీవో కొట్టేస్తే, ఆ జీవో స్థానంలో మరొక ఆర్దినెన్స్ తీసుకుని వచ్చారంటే, ఆ ఆర్డినెన్స్ ద్వారా, మీరు ఇష్టం వచ్చినట్టు నియమించుకోవటానికే కాదా, ఇలా చేసింది అని చెప్పటంతో, ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్ట్, ఈ విధంగా ఆర్డినెన్స్ తీసుకుని రావటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. మార్చ్ లో తదుపరి విచారణ సందర్భంలో, ఉత్తర్వులు ఇస్తామని కోర్టు తేల్చి చెప్పింది.