ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ, మరోసారి హైకోర్టు మెట్లు ఎక్కనున్నారు. గతంలో ఒక మిస్సింగ్ కేసులో, డీజీపీని తమ ముందు హాజరు కావలసిందిగా హైకోర్టు ఆదేశించింది. అది అయిపోయిన తరువాత, చంద్రబాబు వైజాగ్ పర్యటనకు అనుమతి ఇచ్చి, తరువాత ఆయన పర్యటనకు వెళ్ళకుండా వైసిపీ కార్యకర్తలు అడ్డుకుంటే, వారిని అరెస్ట్ చెయ్యకుండా, చంద్రబాబుకు నోటీస్ ఇచ్చి అదుపు చెయ్యటం పై, హైకోర్టులో డీజీపీకి మరోసారి అక్షింతలు పడ్డాయి. ఈ కేసులో కూడా డీజీపీని తమ ముందు హాజరు కావాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఆ సమయంలో, డీజీపీ దాదాపుగా ఆరు గంటలు కోర్టులోనే ఉన్నారు. ఆ సమయంలో, హైకోర్ట్, 151 నోటీస్ ని చదివి వినిపించాలి అంటూ, ఆదేశించటం సంచలనం అయ్యింది. ఇప్పుడు మూడో సారి, డీజీపీని హైకోర్ట్ ముందుకు రావాల్సిందిగా ఆదేశించింది. అక్రమ మద్యం రవాణా చేస్తున్న కేసుల్లో పోలీసులు కొన్ని వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే, ఆ వాహనాలు అప్పగింత విషయంలో, రూల్స్ కు విరుద్ధంగా, పోలీసులు ప్రవర్తిస్తున్నారని, హైకోర్టులో ఒక కేసు ఫైల్ అయ్యింది. ఈ కేసు విచారణ సందర్భంలో, గతంలో హైకోర్టు దీని పై వివరణ ఇవ్వాల్సిందిగా, పోలీసులని ఆదేశించింది.

అయితే పోలీసులు నుంచి సరైన సమాధానం రాకపోవటంతో, హైకోర్ట్, డీజీపీని తమ ముందు హాజరుకావల్సిందిగా ఆదేశించింది. ఈ రోజు విచారణ జరిపిన న్యాయస్థానం, రేపటికి కేసు వాయిదా వేసి, రేపు తమ ముందు డీజీపీ హాజరు అయ్యి, వివరణ ఇవ్వాలని, ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి, న్యాయవాది ప్రసాద్ మాట్లాడుతూ "అక్రమ మద్యం తరలింపు కేసుల్లో సీజ్ చేసిన వాహనాల విషయంలో, వాహనదార్లు తమ వాహనాలు తమకు అప్పగించాలని కోర్టుకు వచ్చారు. ఎక్ష్సైజ్ చట్టంలో అయితే, ఆ వాహనాలు డిప్యూటీ కమీషనర్ కు అప్పచేప్పాలని ఉంది. అదే సీఆర్పీసీలో అయితే, సెక్షన్ 102 ప్రకారం, వాహనాలు, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంటనే ఇచ్చేయాలని ఉంది. అలాగే కోర్టుకు కాని, డిప్యూటీ కమీషనర్ వద్దకు కాని, ఈ వాహనాలు వస్తే, తమకు తమ వాహనాలు ఇవ్వాలి అని, అర్జీ పెట్టుకునే అవకాసం ఉంది. అయితే పోలీసులు మాత్రం, ఈ వాహనాలు అన్నీ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాయని కోర్టుకు చెప్పారు. మరి పోలీస్ స్టేషన్ లో ఉంటే వెంటనే ఇచ్చాయాలి కదా, అని కోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈ రోజు విచారణలో, పోలీసులు చెప్పిన వివరణ సమంజసంగా లేదని, రేపు డీజీపీ నేరుగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని, కోర్టు ఆదేశించింది అని" న్యాయవాది ప్రసాద్ తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read