ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరపకూడదు అంటూ, వైసీపీ చేస్తున్న ఎత్తులు గత ఏడాదిగా గమనిస్తూనే ఉన్నాం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమీషనర్ గా ఉన్నంత కాలం, ఎన్నికలు జరపకూడదని డిసైడ్ అయ్యి, ఎన్ని అడ్డంకులు సృష్టించారో చూసాం. ఒకసారి ఎన్నికలు పెట్టాలని, మరోసారి నిమ్మగడ్డను పదవి నుంచి తొలగించి, మరొకసారి కోర్టు దిక్కరణ, మరోసారి ఎన్నికలు జరపకూడదు అని, ఇలా ప్రతి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగులుతూనే వచ్చింది. ఇక చివరగా మొన్న సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగలటంతో, ఇక తప్పక ఎన్నికలకు సహకరిస్తాం అంటూ ప్రకటించారు. అయినా అనేక విధాలుగా టార్గెట్ చేస్తున్నారు అనుకోండి. అయితే ఇది పక్కన పెడితే, సుప్రీం కోర్టు తీర్పు రాబోయే మూడు రోజులు ముందే హైకోర్టులో ఎన్నికలు జరపకూడదు అంటూ మరో పిటీషన్ దాఖలు అయ్యింది. ప్రభుత్వం వ్యాక్సిన్ కోసం అని ఎన్నికలు వాయిదా వేస్తే, ఈ పిటీషన్ మాత్రం, ఎవరో బయట వ్యక్తులు వేసారు. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల సంఘం, 2019 ఓటర్ల జాబితా పరిగణలోకి తీసుకుందని, దీని వల్ల 3.60 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయారని, ఎన్నికలు ఆపి, 2021 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరపాలి అంటూ, గుంటూరు జిల్లాకు చెందిన ధూళిపాళ్ల అఖిల పిటీషన్ వేసారు.
దీని పై గత వారం రోజులుగా వాదనలు జరుగుతూ వచ్చాయి. దీని పై ఈ రోజు హైకోర్టు తీర్పు ఇస్తూ, ఈ దశలో తాము ఎన్నికల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని, అందుకే ఈ పిటీషన్ కొట్టేస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. ఈ పిటీషన్ పై వాదనలు వినిపించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరుపున న్యాయవాది, 2021 కి సంబందించిన ఓటర్ల జాబితా అందుబాటులోకి రాకపోవటంతోనే, 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరుపుతున్నట్టు తెలిపారు. నామినేషన్ లు మొదలు అయిన తరువాత, కోర్టుల జోక్యం చేసుకోవటం కుదరదని వాదించారు. అయితే పిటీషనర్ తరుపు న్యాయవాది మాత్రం, ఎన్నికలు రద్దు చేయాలని, అందరికీ ఓటు హక్కు కల్పించాలని కోరారు. అయితే హైకోర్టు, ఈ దశలో జోక్యం చేసుకోలేమని పిటీషన్ కొట్టేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పదే పదే చెప్పిన, ప్రభుత్వం తమకు 2021 ఓటర్ల జాబితా ఇవ్వలేదని, ఇస్తాం అని కోర్టుకు అఫిడవిట్ ఇచ్చి కూడా, ప్రభుత్వం మాట తప్పింది అంటూ, దీనికి బాధ్యులను చేస్తూ ద్వివేది, గిరిజా శంకర్ లో పై, చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.