ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంసం అయ్యాయి. ముఖ్యంగా ఏపిలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పైన, గత రెండేళ్లుగా హైకోర్టు అనేక మార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. హైకోర్టు చివరకు, డీజీపీని కూడా కోర్టుకు పిలిచింది. హైకోర్టు ఇంత ఆగ్రహంగా ఉన్నా సరే, ఎక్కడా తప్పులు సరి చేసుకోవటం లేదు. ప్రభుత్వ పెద్దల ఒత్టిడో లేక మరేదైనా కారణమో కానీ, పోలీసులు తీరు మారటం లేదు. నిన్న ఒక కేసు సందర్భంలో హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. ఎవరినైనా అదుపులోకి తీసుకున్న సమయంలో, వారికి 24 గంటల్లోగా మేజిస్ట్రేట్ల ముందు హాజరుపరచాలని, ఎన్ని సార్లు చెప్పినా ఎందుకు పాటించటం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా మీ దగ్గరే ఎందుకు నిర్భందిస్తున్నారు అని కోర్టు ప్రశ్నించింది. ఒకటి కాదు రెండు కాదు, రోజులకు రోజులు మీ దగ్గరే వారిని ఉంచితే, పోలీసులు లాలూచిపడ్డారని అభిప్రాయానికి రావాల్సి ఉంటుందని హైకోర్ట్ ఘాటుగా వ్యాఖ్యానించింది. అక్రమంగా పోలీసులు నిర్బందిస్తున్నారని, హైకోర్టు ముందుకు అనేక పిటీషన్లు విచారణకు వస్తున్నాయని, ఇదే వైఖరి కొనసాగితే, రాష్ట్ర డీజీపీని కోర్టు పిలిపించాల్సి ఉంటుందని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీ తమ దగ్గరకు వచ్చి వివరణ ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.
ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర స్పందిస్తూ, ఇలాంటి కేసులు విషయంలో, గతంలో తాను పని చేసిన చోట ఏమి చేసానో, రికార్డులు చూసుకోండి అంటూ ఒకింత ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేసారంటే, ఆయన ఎంత సీరియస్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. అరెస్ట్ చేసిన వ్యక్తులు ఎలాంటి వారో తాము చెప్పటం లేదని, వారికి ఉండే హక్కులు గురించి చెప్తున్నామని, ఎవరిని అరెస్ట్ చేసినా, 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు ఉంచాలని ఆదేశించింది హైకోర్టు. పులివెందులలో, ఓబుల్‌రెడ్డి వెంకటప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తిని అక్రమంగా నిర్బంధించటం పై నివేదిక ఇవ్వాలని పులివెందుల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని హైకోర్టు ఆదేశించింది. అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ తమ ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇలాంటి అక్రమ నిర్బంధాల పై గతంలో కూడా అనేక సార్లు హైకోర్టు సీరియస్ అయినా , పోలీసుల్లో ఎలాంటి మార్పు ఉండటం లేదు.