రాజధాని అమరావతి విషయంలో దాఖలు అయిన పిటీషన్ పై ఫుల్ బెంచ్ విచరణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణ మూడవ రోజు కూడా కొనసాగింది. రైతుల తరుపున శ్యాం దివాన్ వాదనలు వినిపించారు. ప్రభుత్వాలు చేసే విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు అని, రాజధాని నిర్మాణం దేశ ప్రతిష్టత ముడి పడిన అంశం అని కోర్టు ముందు వాదించారు. అయితే ఈ విచారణ సందర్భంగా హైకోర్ట్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మూడు రాజధానులలో ఒకటైన జ్యుడిషియల్ క్యాపిటల్ అనే పదం పై హైకోర్టు ప్రశ్నల వర్షం సంధించింది. అసలు జ్యుడిషియల్ క్యాపిటల్ అనే దానికి అర్ధం ఏమిటి అంటూ హైకోర్టు ప్రశ్నించింది. వికేంద్రీకరణ చట్టంలో, హైకోర్టుని కర్నూల్ లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్టు అర్ధం అవుతుందని, ఇలాంటి హామీలను వికేంద్రీకరణ చట్టంలో అసలు పొందుపరచవచ్చా అని, కోర్ట్ ప్రశ్నించింది. అలాగే, అసలు వికేంద్రీకరణ చట్టంలో, ఎక్కడా కర్నూల్ లో హైకోర్టు ఉంటుంది అనే విషయం పై స్పష్టత లేదు కదా అని కోర్ట్ కామెంట్ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో, కర్నూల్ తో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారికి విబేధాలు సృష్టించే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, ఈ మేరకు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.
ఇప్పటికే హైకోర్టుని అమరావతిలో ఏర్పాటు చేస్తూ, రాష్ట్రపతి ఇచ్చిన నోటిఫికేషన్ విషయాన్ని కూడా చీఫ్ జస్టిస్ ప్రస్తావించారు. అలాగే కేంద్రం కొత్త నోటిఫికేషన్ ఇవ్వనంత వరకు, హైకోర్టు ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశమే లేదు కదా అని అన్నారు. మరి ఇలాంటి సమయంలో, హైకోర్టు, కర్నూల్ లో పెట్టటానికి ఎలా సాధ్య పడుతుందని ప్రశ్నించారు.అమరావతి విషయంలో ఒకసారి ఇప్పటికే తీసుకున్న నిర్ణయం, హైకోర్టు విషయాలో కూడా వర్తిస్తుందా అని ప్రశ్నించారు. రైతుల తరుపున శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తూ, ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు తుంగలోకి తొక్కి, లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ కార్యాలయాలు కర్నూల్ లో ఏర్పాటు చేసారని అన్నారు. రాజధాని అమరావతి విషయంలో ఒకసారి తీసుకున్న నిర్ణయం, మళ్ళీ మార్చటానికి వీలు లేదని అన్నారు. ఇప్పటికే విభజన చట్టం ప్రకారం, హైకోర్టుని అమరావతిలో పెడుతూ కేంద్రం నోటిఫికేషన్ కూడా ఇచ్చిందని అన్నారు. హైకోర్టు మీద నిర్ణయం ఇప్పటికే జరిగిపోయిందని అన్నారు. అన్ని విభాగాలు ఒక చోట ఉంటేనే అది రాజధాని అవుతుందని వాదనలు వినిపించారు.