రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్ (ఆర్​ - 5 జోన్​) ఏర్పాటు విషయంపై.. రాజధాని నిర్మాణంలో భాగస్వాములు, భూములిచ్చిన రైతులు.. సీఆర్డీఏకు అభ్యంతరాలు సమర్పించేందుకు 30 రోజులు గడువు పొడిగిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎస్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాజధాని బృహత్ ప్రణాళిక ప్రకారం ఇప్పటి వరకు 4 నివాస జోన్లు ఉండేవి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అందుబాటు ధరల్లో గృహనిర్మాణ జోన్ - 5 ఏర్పాటు చేసేందుకు సీఆర్డీఏ నిర్ణయించింది. అందులో భాగంగా కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో 900 ఎకరాల్ని ఆర్ - 5 జోన్‌గా పేర్కొంది.

ఈ వ్యవహారంపై అభ్యంతరాలు సమర్పించేందుకు 15 రోజులు గడువిస్తూ ప్రభుత్వం ఈనెల 10న గెజిట్ జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యం, రాష్ట్రంలో లాక్​డౌన్ పరిస్థితుల కారణంగా అభ్యంతరాలు సమర్పించేందుకు గడువును పొడిగించాలని కోరుతూ రైతు ఎ.నందకిశోర్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం అభ్యంతరాల సమర్పణ గడువును పొడిగించింది.

మరో పక్క, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌, వ్యవస్థాపక కుటుంబ సభ్యుల నియామకాలపై... ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాలు చేస్తూ... దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులని కౌంటర్‌ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. ట్రస్ట్‌ ఛైర్‌పర్సన్‌గా సంచైత గజపతిరాజు, వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా ఊర్మిల గజపతిరాజు, ఆర్వీ సునీత ప్రసాద్‌లను నియమిస్తూ ఈ నెల 3న ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఆదేశాలపై కేంద్ర మాజీ మంత్రి అశోక్​ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read