గత కొన్ని రోజులుగా, హైకోర్ట్ జడ్జిల పై, ఇష్టం వచ్చినట్టు, వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులు, వైసీపీ ఎంపీ, నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. జడ్జిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులపై న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేయగా, న్యాయస్థానం స్పందించింది. సోషల్ మీడియాలోని పోస్టులను, నేతల వీడియో క్లిప్పింగ్‌లను పరిశీలించింది. ఇవన్నీ పరిశీలించిన కోర్ట్, సుమోటోగా విచారణకు తీసుకున్నట్టు కోర్ట్ తెలిపింది. దీనికి సంబంధించి 49 మందికి నోటీసులు జారీ చేసింది. వీరిలో బాపట్ల ఎంపీ సురేశ్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్, వైసీపీ నాయకుడు రవిచంద్ర రెడ్డి కూడా ఉన్నారు.
జడ్జిలను ఉద్దేశపూర్వకంగా కించపరిచారని న్యాయవాది లక్ష్మీనారాయణ మీడియాతో అన్నారు. సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థ పై పోస్టులు చాలా అసభ్యకరంగా ఉన్నాయని, కోర్టులను రాజకీయాలకు వేదిక చేసుకోవడం బాధ కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్ ఘటనలో కోర్టుపై లేనిపోని వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల వెనుక అనేకమంది నేతలు, ఎంపీలూ ఉన్నారని లక్ష్మీనారాయణ అన్నారు. కోర్టును భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. కోర్టు తీర్పుల్లో ఎలాంటి పక్షపాతం ఉండదని స్పష్టం చేశారు. దోఘలైన వారిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని బార్ కౌన్సిల్ ఛైర్మన్ రామారావు అభిప్రాయపడ్డారు.
న్యాయస్థానాలకు దురుద్దేశాలు అంటగట్టడం సరికాదని మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. కావాలంటే కోర్టు తీర్పులపై పైకోర్టుకు వెళ్లవచ్చని సూచించారు. ప్రతి తీర్పుపైనా అప్పీలు చేసుకునే అవకాశం ఉంటుందన్న ఆయన.. న్యాయమూర్తులపై కామెంట్స్ చేయడం సరికాదని హితవు పలికారు. అసభ్యకర వ్యాఖ్యలు చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేశారు. ఇది ఒక రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. కోర్టు తీర్పును విమర్శించే హక్కు పౌరులకు ఉందని అన్నారు.