తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి, వైసీపీ పార్టీ వైపు వెళ్ళిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే మద్దాలి గిరితో పాటుగా, గుంటూరు అర్బన్ పోలీసులకు కూడా హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. సామగ్రి అపహరణ కేసులో, అటు ఎమ్మెల్యే మద్దాలి గిరికి, ఇటు గుంటూరు అర్బన్ పోలీసులకు హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. ఇక కేసు విషయానికి వస్తే, గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్‌లో, డీబీ ఫ్యాషన్ అనే ఒక షాపు ఉంది. ఆ షాపు పై కొన్ని రోజులు క్రితం కొంత మంది వచ్చి దౌర్జన్యం చేసారు. షాపు మూసి ఉన్న సమయంలో, తాళం పగులుకొట్టి మరీ, కోటీ యాభై లక్షల విలువ కలిగిన సామగ్రిని షాపులో నుంచి అపహరించారు. దీంతో షాపు ఓనర్లు గుంటూరు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే పోలీసుల నుంచి సరైన సహకారం వారికి అందలేదు.
దీంతో ప్రతి వారం పెట్టే గ్రీవెన్స్‌కు వెళ్లి, తమకు జరిగిన అన్యాయాన్ని జిల్లా ఎస్పీకి చెప్పుకున్నారు. అక్కడ కూడా సహకారం అందలేదని చెప్తున్నారు. అధికారులు ఎవరూ స్పందించకపోవటంతో, ఇక న్యాయ దేవతే దిక్కు అనుకుని, షాపు ఓనర్ కొప్పురావూరి శివ ప్రసాద్ హైకోర్టుకు మోర పెట్టుకుంటూ, పిటీషన్ దాఖలు చేసారు. ఎమ్మెల్యే మద్దాలి గిరి చేస్తున్న ఒత్తిడితోనే, పోలీసులు తనకు సహకారం అందించలేదని, తన షాపులో దొంగతనం చేసిన వారికి మద్దలి గిరి మద్దకు ఉందని, కోర్టుకు తెలిపారు. తన షాపుని ఆక్రమించే ఎత్తుగడ వేసారని అన్నారు. ఎమ్మెల్యే ఒత్తిడితోనే ఈ మొత్తం తాతంగం జరిగిందని ఆరోపించారు.. దీంతో పిటీషన్ ను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం, ఎమ్మెల్యే మద్దాల గిరితో పాటుగా, పోలీసులు, రెవిన్యూ సిబ్బందికి కూడా నోటీసులు జారీ చేసింది.