ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న, పది, ఇంటర్ పరీక్షల పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు సంబంధించి, ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు వేసిన పిటీషన్ పై సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్, బసవ ప్రభు పాటిల్ వాదనలు వినిపించారు. దాదాపుగా గంట సేపు సుదీర్ఘ వాదనలు విన్న అనతంరం హైకోర్టు స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరొకసారి పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి అఫిడవిట్ వేయాలని, ఈ కేసుని మే 3వ తేదీకి వాయిదా వేసింది. ముఖ్యంగా సీనియర్ కౌన్సిల్ చేసిన వాదనలో, పలు అంశాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. సుమారు పది లక్షలకు పైగా విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరు కావలసి ఉండటంతో, వారి తల్లిదండ్రులతో పాటు, మొత్తం 30 లక్షల మంది అక్కడే ఉన్నారని, అదే విధంగా ఉపాధ్యాయులు, పరీక్షలు నిర్వహించే సిబ్బంది, మొత్తం ఎక్కవ మంది అవుతారని, ఈ నేపధ్యంలో, వీరి అందరితో పరీక్షలు నిర్వహణ చేయటం సాధ్యం అవుతుందా అని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో పాటు ఎవరికీ అయితే, ఇప్పటికే కో-వి-డ్ వచ్చిన విద్యార్ధులు ఎలా పరీక్ష రాస్తారు అని, సీనియర్ కౌన్సిల్ వాదించారు. నిబంధనలు ప్రకారం వారు ఐసొలేషన్ లో ఉండాలి కదా అని కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపు న్యాయవాది, తాము వీరి అందరికీ ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
హైకోర్టు మాత్రం వారి మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా, ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహణ చేస్తాం అనేది, ఎలా సాధ్యం అని చెప్పి, హైకోర్టు ప్రశ్నించింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి అని, ఈ తరుణంలో పరీక్షలు నిర్వహించటం సమంజసమా కాదా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి మళ్ళీ అలోచించికోవాలని, ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు రాష్ట్రంలో, ఇప్పటికే వైరస్ సోకినా వారు, బెడ్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారని, ఈ నేపధ్యంలో పది లక్షల మంది పిల్లలు పరీక్షలకు రావటం, ఒకరికి వస్తే వారి ఇంట్లో వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో, మిగతా వారు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ సమయంలో ఇటువంటి పరీక్షల నిర్ణయం ఎంత వరకు సమంజసం అనేది కూడా అలోచించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితువు పలికింది. దీంతో పాటు మిగతా రాష్ట్రాల్లో రద్దు, వాయిదా వేసిన రాష్ట్రాల డేటాని కూడా హైకోర్టు ముందు ఉంచారు. ఈ నేపధ్యంలో , ఈ విషయాలు అన్నీ పరిగణలోకి తీసుకోవాలని, హైకోర్టు ఆదేశిస్తూ, మే 3కి కేసు వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు బాల్ ప్రభుత్వం కోర్టులో ఉంది.