ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులతో, కోర్టుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురు అవుతూనే ఉన్నాయి. తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తే, ఏపి ప్రభుత్వానికి అవమానం అనే చెప్పాలి. అయితే ఇంత వరకు హైకోర్ట్ చేసిన వ్యాఖ్యల పై, ఎవరూ స్పందించలేదు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపి హైకోర్టులో ఉపాధి హామీ పధకం నిధులు విడుదల పై కేసు విచారణ జరిగింది. చంద్రబాబు హయాంలో, చివరి ఏడాదిలో జరిగిన ఉపాధి హామీ పనులు నిధులు విషయంలో, పనులు చేసిన వారికి డబ్బులు ఇవ్వలేదు. కేంద్రం నుంచి నిధులు వచ్చినా ప్రభుత్వం ఆ డబ్బులు కాంట్రాక్టర్ లకు ఇవ్వలేదు. దీని పై చిత్తూరు జిల్లాకు చెందిన ఒక కాంట్రాక్టర్, అలాగే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మరో కాంట్రాక్టర్ తమకు ప్రభుత్వం బిల్లులు చెల్లించటం లేదని, ఎన్ని సార్లు అడిగినా స్పందన ఇవ్వటం లేదని, హైకోర్టుని ఆశ్రయించారు. అయితే దీని పై విచారణ చేసిన హైకోర్టు, ఆర్ధిక శాఖ, పంచాయతీ రాజ్ కమీషనర్ ను పిలిచి, ఈ కేసు పై విచారణ చేసింది. అయితే పంచాయతీ రాజ్ తరుపున వాదిస్తున్న న్యాయవాది, ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవని, అందుకే చెల్లించ లేదు అంటూ హైకోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ఒక్కసారిగా, ఆ సమాధానానికి ఆశ్చర్య పోయింది.
ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ, ఈ మాత్రం బిల్లులు చెల్లించటానికి కూడా మీకు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అంటూ ప్రశ్నించింది. ఇంత చిన్న అమౌంట్ కే డబ్బులు లేవు అంటే, రేపు మూడు రాజధానులు ఎలా కడతారు, మీ ఆర్ధిక పరిస్థితి ఇలా ఉందని తెలిస్తే, ఏ కాంట్రాక్టర్ ముందుకు వచ్చి, మూడు రాజధానులు కడతారు అంటూ, హైకోర్టు ప్రశ్నించింది. అదే విధంగా, పనులు చేసిన కాంట్రాక్టర్ ను ఇబ్బందులు పెడుతున్నారని, వారి ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని హైకోర్టు పేర్కొంది. వారికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే, వారి కుటుంబం ఎలా మనుగడ సాగిస్తుంది, ఆ కంట్రాక్టర్ గుడ్ విల్ దెబ్బ తింటుంది కదా అని కోర్టు ప్రశ్నించింది. అయితే ఇందులో రాజధాని నిర్మాణాకి సంబంధించి, కోర్టు చేసిన వ్యాఖ్యలు గమనించాల్సిన అంశం. చిన్న చిన్న కాంట్రాక్టులకు డబ్బులు కూడా ఇవ్వలేని వారు, మూడు రాజధానులు ఎలా కడతారు, అసలు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో, మాకు అఫిడవిట్ రూపంలో ఇవ్వండి అంటూ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.