అమరావతిలో ఏముంది ? అమరావతి ఒక గ్రాఫిక్స్. అమరావతి ఒక స్మశానం. అమరావతి ఒక ఏడాది. అమరావతిలో పందులు తిరుగుతున్నాయి. 5 ఏళ్ళలో అమరావతిలో ఏమి కట్టారు. అమరావతిలో ఒక్క ఇటుక పడలేదు. అమరావతిలో ఒక్క శాశ్వత కట్టడం లేదు. అమరావతి ఒక భ్రమరావతి. ఇవి అమరావతి పై వైసీపీ నాయకులతో పాటు, కొంత మంది అమరావతి పై గిట్టని వారు చేసిన వ్యాఖ్యలు. అమరావతి పై హేళన చేస్తూ, వ్యాఖ్యలు చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ చేస్తున్నారు కూడా. అయితే, ఇప్పుడు ఈ వాదనలకు ఫుల్ స్టాప్ పడనుంది. ఈ రోజు హైకోర్టు పరిధిలో జరిగిన విచారణలో, హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ రోజు అమరావతికి సంబంధించి వేసిన కొన్ని పిటీషన్ల పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజధాని అమరావతికి ఇప్పటి వరకు చేసిన ఖర్చు, జరుగుతున్న పనుల పై, పిటీషనర్ తరుపు న్యాయవాది, హైకోర్టు ముందు కొన్ని ఆధారాలు పెట్టారు. అందులో ముఖ్యంగా అమరావతి కోసం రూ.52 వేల కోట్ల పనులు సాగుతున్నాయని, సిఆర్డీఏ నివేదికను కోర్టుకు సమర్పించారు.
ఇవి చూసిన హైకోర్టు, కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఇప్పటి వరకు అమరావతి కోసం ఎంత ఖర్చు చేసారు. ఎన్ని భవనాలు కట్టారు. ఇవి ఎంత స్థాయిలో నిర్మాణం అయ్యాయి. కాంటాక్టర్లకు ఇంకా ఎంత డబ్బులు ఇవ్వాలి. అంత డబ్బు ఎలా సమీకరించారు. ఇలాంటి వివరాలు మొత్తం తమ ముందుకు ఉంచలాని, దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర అకౌంటెడ్ జనరల్‌కు హైకోర్టు ఆదేశించింది. కట్టిన భవనాలు వాడుకోకుండా అలా ఉంచితే పాడైపోతాయి కదా. ఆ నష్టం ఎవరు భరిస్తారు అని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసు విచారణను హైకోర్టు, ఈ నెల 14కు వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు అధికార వైసీపీ అమరావతిలో కట్టిన భవనాలు, వాటి ఖర్చులు, అవి ఏ స్థాయిలో పనులు పూర్తయ్యాయి వంటి పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో, ఇప్పటి వరకు అమరావతిలో ఏమి లేదు అని వారు చేస్తున్న వాదన తప్పు అని వారే చెప్పినట్టు అవుతుంది. మరి ప్రభుత్వం ఏమి చెప్తుందో, 14 వ తేదీ వరకు ఆగాల్సిందే.