ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తనకు సహకరించటం లేదని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ ఈ రోజు హైకోర్టులో విచారణకు వచ్చింది. మొన్న శుక్రవారం జరిగిన విచారణలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆదిత్యనాద్ దాస్ పేరు, చేర్చేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ రోజు ఈ కేసు పై విచారణకు వచ్చింది. దాదాపుగా రెండు నెలలుగా, రాష్ట్ర ప్రభుత్వం తనకు సహకారం అందించటం లేదని, హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటూ, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ హైకోర్ట్ లో, కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు. గతంలో ఇదే బెంచ్ ముందు, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు సహకరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా, తనకు సహకరించటం లేదని, ఎన్నికల సంఘం పిటీషన్ దాఖలు చేసింది. ఇటీవల కాలంలో జరిగిన బదిలీలు, తరువాత తాను ఎన్నికల కమిషన్ లో సిబ్బందిని నియమించటం, సెక్రటరీ నియామకం, కలెక్టర్ ల నియామకం, ప్రవీణ్ ప్రకాష్ పై చర్యలు, ఈ మొత్తం అంశాలు కోర్టు దృష్టికి తెచ్చారు.
అదే విధంగా, ఎన్నికల కమిషన్ కు నిధులు విషయంలో కూడా ఈ కోర్టు ధిక్కరణ పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ పై అటు రాష్ట్ర ప్రభుత్వం తరుపున, ఇటు ఎన్నికల కమిషన్ తరుపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అయితే అప్పటి చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, ఇప్పటి చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేదికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ కేసు పై తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇదే సందర్భంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం, డిసెంబర్ 18న ఈ పిటీషన్ వేసారని, తరువాత ఈ పిటీషన్ విచారణకు రాకపోతే ఎందుకు మళ్ళీ కోర్టుకు రాలేదని, రిజిస్ట్రీని ఎందుకు అడగలేదు అంటూ ప్రశ్నించింది. మొత్తానికి ఈ కేసు 15 రోజులకు వాయిదా పడింది. దీని పై కోర్టు ఇప్పటి వరకు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేదు. మరో పక్క, నామినేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉండటం, కొన్ని అంశాల్లో ప్రభుత్వం, ఎస్ఈకీ సహకరించకపోవటం తెలిసిందే.