ఈ రోజు మిషన్ బిల్డ్ ఏపి పిటీషన్ పై, జస్టిస్ రాకేశ్ కుమార్ తప్పుకోవాలి అంటూ ప్రభుత్వం వేసిన పిటీషన్ పై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రధానంగా ఇందులో పరిశీలించాల్సిన అంశం ఏమిటి అంటే, ఐఏఎస్ అధికారి, మిషన్ బిల్డ్ ఏపి అధికారి ప్రవీణ్ కుమార్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ తప్పుగా ఉందనే అసంతృప్తి ఉందని చెప్తూ, అందులో జడ్జి అనని మాటలు అన్నారు అంటూ, వక్రీకరించారు అంటూ కోర్టు భావించింది. ఈ అంశం కోర్టు ధిక్కరణ కేసు కిందకు వస్తుందని, అంతే కాకుండా క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని, మొత్తంగా ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ పై కోర్టు ధిక్కరణ కేసుతో పాటుగా, క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయటం పెను సంచలనంగా మారింది. మీ మీద ఎందుకు కోర్టు ధిక్కరణ కేసు కింద నమోదు చేయకూడదు అంటూ హైకోర్టు ప్రశ్నిస్తూ, రెండు వారాల్లో సమాధానం చెప్పాలని కోరింది. ఆయన పై క్రిమినల్ చర్యల కింద కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలనీ రిజిస్ట్రీని కోర్టు ఆదేశించింది. ఈ కేసుని ఫిబ్రవరి రెండో వారినికి వాయిదా వేసింది హైకోర్టు. అయితే ఈ సందర్భంగా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా, కోర్టులో తప్పుడు అఫిడవిట్ వేయకుండా, అనని మాటలు, అన్నారని చెప్పకుండా చూడాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం ఎక్కువగా న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కోర్టు అభిప్రాయ పడింది.
ఇక ఈ కేసు పూర్వపరాలు చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ బిల్డ్ ఏపి అనే పేరుతో, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ అధీనంలో ఉన్న స్థలాలు కొన్ని అమ్మేసి, సొమ్ము చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వాటిని వివిధ పధకాలకు, ఇతర అవసరాలకు వాడుకోవచ్చు అని ప్రభుత్వం ఆలోచన. ఒక పక్క భారీగా అప్పులు చేస్తూ, ఇలా ఆస్తులు కూడా అమ్మే ప్రక్రియ మొదలు పెట్టటంతో, కొంత మంది కోర్టుకు వెళ్లారు. ఈ సందర్బంగా జస్టిస్ రాకేశ్ కుమార్ ధర్మాసనం, ప్రభుత్వ తీరుని తప్పు బట్టింది. అయితే ప్రభుత్వం ఈ సందర్భంగా రాకేశ్ కుమార్ తమ ప్రభుత్వం పై కొన్ని వ్యాఖ్యలు చేసారు, కేంద్రానికి పాలన అప్పగిస్తాం అన్నారు, ఆయన ఈ కేసు విచారణ చేయటానికి వీలు లేదు అంటూ కేసు వేసింది. ఈ కేసు పై వాదనల సందర్భంలో తాను ఆ మాటలు అనలేదని, ఎక్కడ అన్నానో, ఏ పత్రికలో ఆ వార్త వచ్చిందో చూపించాలని రాకేశ్ కుమార్ కోరారు. అయితే ప్రభుత్వ తరుపు వాదనలు, తాము అఫిడవిట్ లో చెప్పిన వాటికి, ఆధారాలు చూపించలేదు. ఈ అంశం పైనే ఈ రోజు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాము చెప్పని మాటలు, చెప్పినట్టుగా అఫిడవిట్ లో వేసారు అంటూ, కోర్టు ధిక్కరణ కేసును నమోదు చేసింది.