ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు పెద్దిరెడ్డి వేసిన హౌస్ మోషన్ పిటీషన్ పై విచారణ జరిగింది. ఈ రోజు ఆదివారం అయినా సరే, హౌస్ మోషన్ పిటీషన్ వేయటం, మంత్రిని నియంత్రిస్తూ ఆదేశాలు రావటంతో, హైకోర్టు ఈ కేసు తీవ్రత దృష్టిలో పెట్టుకుని విచారణ చేసింది. అయితే ఈ పిటీషన్ లో పెద్దిరెడ్డికి కొంత ఊరట లభించింది. మంత్రి పెద్దిరెడ్డిని ఇంటి వద్దే ఉండాలని నియంత్రణ చేయలేము కానీ, మంత్రి మీడియాతో మాట్లాడవద్దు అని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు మాత్రం పాటించాల్సిందే అని తేల్చి చెప్పింది. మంత్రి మీడియాతో పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడటానికి వీలు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో పెద్దిరెడ్డికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకుంటే నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా, మంత్రిగా విధులు నిర్వహించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఇప్పుడు కోర్టు మాత్రం, ఎక్కడికైనా వెళ్ళవచ్చు అని చెప్పింది. అయితే మీడియాతో మాట్లాడకూడదు అని హైకోర్టు కూడా సమర్ధించటం, మంత్రి కంట్రోల్ తప్పి మాట్లాడుతున్న మాటలకు కళ్ళెం వేసింది అనే చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాల పై నిన్న మంత్రి పెద్దిరెడ్డి హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. ఆ పిటీషన్ ని ఈ రోజు హైకోర్టు విచారణ చేసి ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
తన పై ఇచ్చిన ఉత్తర్వులు ఏకపక్షంగా ఉన్నాయని, కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా, ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది అంటూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం పై, పెద్దిరెడ్డి హైకోర్టుకు వెళ్లారు. ఇక ఈ కేసు పూర్వాపరాలు చూస్తే, పంచాయతీ ఎన్నికల మొదటి విడత ఏకాగ్రీవాల్లో, చిత్తూరు, గుంటూరు జిల్లాల ఏకాగ్రీవాలు అసాధారణంగా వచ్చాయి. మిగతా జిల్లాల్లో నామమాత్రంగా ఉంటే, ఈ రెండు జిల్లాల్లో అధికంగా రావటంతో, ఎన్నికల కమిషన్ వాటి పై పరిశీలన చేసిన తరువాతే ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే మంత్రి పెద్దిరెడ్డి మీడియా సమావేశం పెట్టి, నిమ్మగడ్డ మాటలు విని ఏకాగ్రీవాలు ప్రకటించకపోతే, ఎన్నికలు అయిన తరువాత అధికారులను బ్లాక్ లిస్టు లో పెడతాం అని, వెంటనే అధికారులు ఏకాగ్రీవాలు ప్రకటించాలని హుకుం జారీ చేసారు. ఎన్నికల వ్యవహారాల్లో తల దూర్చటమే కాక, ఏకంగా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులను బెదిరించటంతో, ఎన్నికల కమిషన్ పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చి, మీడియాతో మాట్లాడవద్దు అని చర్యలు తీసుకుంది. అయితే దీని పై స్పందించిన హైకోర్టు, హౌస్ అరెస్ట్ చేయమనే ఆదేశాలు కొట్టేస్తూ, మీడియాతో మాట్లాడ వద్దు అని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు సమర్ధించింది.