అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. కొద్ది సేపటి క్రితం లంచ్ మోషన్ పిటీషన్ పై విచారణ చేసింది. అయితే ఇంకా లిఖిత పూర్వ ఉత్తర్వులు హైకోర్టు నుంచి రావలసి ఉంది. నిన్న అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు డీజీపీ అనుమతి నిరాకరించారు. నవంబర్ ఒకటి నుంచి, డిసెంబర్ 17 వరకు, 40 రోజుల పాటు చేయి తలపెట్టిన న్యాయస్థానం టు దేవస్థానం, మహా పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ రాష్ట్ర డీజీపీ నిన్న ఉత్తర్వులు జారీ చేసారు. అమరావతిలోని హైకోర్టు దగ్గర నుంచి తిరుపతి వెంకన్న గుడి వరకు ఈ పాదయాత్ర ఉండాల్సి ఉంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ తో పాటు, ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు. అయితే డీజీపీ మాత్రం అనుమతి నిరాకరించారు. దీంతో రైతులు నిన్న లంచ్ మోషన్ పిటీషన్ వేసారు. న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. హైకోర్టు ఈ లంచ్ మోషన్ పిటీషన్ కు అనుమతి ఇచ్చి, ఈ రోజు మధ్యానం 2.15 నిమిషాలకు దీని పైన విచారణ మొదలు పెట్టింది. అటు ప్రభుత్వం వైపు నుంచి, రైతులు వైపు నుంచి పూర్తీ స్థాయిలో వాదనలు జరిగాయి. డీజీపీ అనుమతి నిరాకరిస్తూ పేర్కొన్న అంశాలు సహేతుకమైన కారణాలు కావని, న్యాయవాది లక్ష్మీ నారాయణ వాదించారు.
నేలపాడులో ఉన్న హైకోర్టు దగ్గర నుంచి, తిరుపతిలో ఉన్న వెంకన్న ఆలయం వారకు పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారని, దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే రైతులు పోలీసులుకు ఇచ్చారని, అటువంటి అప్పుడు సిల్లీ కారణాలతో ఈ అనుమతి నిరాకరించటం అనేది సమంజసం కాదని న్యాయవాది వాదించారు. మరో పక్క ప్రభుత్వం మాత్రం కేవలం శాంతి భద్రతల అంశం సాకుగా చూపిస్తూ పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమని చెప్తుంది. ఇప్పటికే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని, ఈ నేపధ్యంలో అమరావతి రైతులు మూడు రాజధానులకు వ్యతిరేకంగా వెళ్తే, ఇతర ప్రాంతాలకు వెళ్తే ఇబ్బంది అవుతుందని వాదిస్తుంది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, పాదయాత్రకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొన్ని షరతులతో అనుమతి ఇస్తామాని కోర్టు చెప్పింది. దీనికి సంబంధించి షరతులు ఏమిటి అనే దాని పై హైకోర్టు పూర్తి ఆర్డర్ కాపీలో పొందుపరిచే అవకాసం ఉంది. మరి కొద్ది సేపట్లో ఉత్తర్వులు రానున్నాయి.