ఈ రోజు హైకోర్టులో ఏపీ లిబర్టీ అసోసియేషన్ అనే ప్రైవేటు ఆర్గనైజేషన్ వేసిన పిటీషన్ పై విచారణ జరిగింది. ఇందులో ప్రధానంగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో క-రో-నా కేసులు పెరుగుతున్న తీరు పైన, దానికి సంబంధించిన చికిత్స, నిర్ధారణ పరీక్షలు, వీటి అన్నిటి పైన పిటీషనర్ పలు సందేహాలు లేవనెత్తారు. అందులో ప్రధానంగా, పిటీషనర్ లేవనెత్తిన అంశం, టెస్టులు చేసిన తరువాత, చాలా సమయం పడుతుందనే అంశం కోర్టుకు తెలిపారు. దాంతో పాటు, క-రో-నా చికిత్స అందించటానికి, కావలసిన ఆక్సిజన్ నిల్వలు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో అవసరానికి కంటే తక్కువగా ఉన్నాయని, ఇంకా ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ అవసరం ఉందనే వాదనను, పిటీషనర్ తరుపు న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. దీంతో కోర్టు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు ఎంత శాతం ఉన్నాయి, ఎంత మంది పేషెంట్లు ఉన్నారు, వారికీ ఎంత ఆక్సిజన్ అవసరం ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, భవిష్యత్తులో ఎంత అవసరం ఉంది, మీరు ఆక్సిజన్ కోసం ఎలాంటి చర్యలు చేపట్టారు అనే అంశం పై ప్రశ్నలు సందించింది. అదే విధంగా, ఇప్పుడు ఉన్నటు వంటి, ఆక్సిజన్ ఎన్ని రోజుకు సరిపోతుందని, ఎంత మంది పేషెంట్లు ప్రస్తుతం ఆక్సిజన్ వినియోగం తీసుకుంటున్నారని అడిగింది.
దాంతో పాటుగా, కరోనా నిర్ధారణ పరీక్షలు, ఒక రోజుకి పరీక్ష చేస్తే, ఎన్ని రోజుల్లో టెస్ట్ రిజల్ట్ ఇస్తున్నారు ? టెస్ట్ రిపోర్ట్ లేటు అయితే, ఈ లోపు అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, అతని పై పర్యవేక్షణ ఏమైనా ఉంటుందా ? ఎటువంటి చర్యలు చేపట్టారు అనే అంశం పై ప్రశ్నలు సందించింది. అదే విధంగా ఐసోలేషన్ వార్డులు ఎన్ని చోట్ల ఏర్పాటు చేసారు, మొత్తం ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా వాటిని పర్యవేక్షిస్తున్నారు అంటూ, ప్రశ్నలు సందించింది హైకోర్టు. ఈ మొత్తం వివరాలు తమకు కావాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసుని రేపటికి విచారణకు వాయిదా వేసింది. మొత్తం ఈ విచారణ గంట పాటు సాగింది. విచారణలో పలు ప్రశ్నలు, ప్రభుత్వం పై సందించారు. అన్ని వివరాలు పిటీషనర్ కౌన్సిల్ కి కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విచారణ రేపు మళ్ళీ కొనసాగనుంది. ఈ కేసులో ప్రభుత్వం తరుఫున వాదనలను, న్యాయవాది సురేష్ వినిపించారు. ప్రభుత్వం రేపు కోర్టుకి ఇచ్చే సమాధానాలు బట్టి, రేపు కోర్టు ఏమి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.