అమరావతి ఉద్యమం సమయంలో, కృష్ణాయపాలెంలోని, పదకొండు మంది రైతులు పై, పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసుని కొట్టివేస్తూ, కొద్ది సేపటి క్రితం హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలోకి, మూడు రాజధానుల ఉద్యమం పేరుతో బయట నుంచి వస్తున్నారని, అమరావతి ప్రాంత రైతులు ముందు నుంచి ఆందోళన చేస్తూ వచ్చారు. అయితే, అమరావతికి శంకుస్థాపన చేసి 5 ఏళ్ళు అయిన నేపధ్యంలో, బయట వాళ్ళు ఎవరైనా అమరావతి గ్రామాల్లోకి వస్తే, వెంటనే తమకు తెలియచేయాలి అంటూ, పోలీసులు, అక్కడ ఉన్న గ్రామాల ప్రజలందరికీ నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ సందర్భంగానే, కొంత మంది కృష్ణాయపాలెంకి చెందిన, ఎస్సీ, బీసీ సామాజికవర్గానికి చెందిన రైతులు, పోలీసుల నోటీసులు దృష్టిలో పెట్టుకుని, వేరే గ్రామాల నుంచి ఆటల్లో తోలుకుని మూడు రాజధానుల శిబిరానికి తీసుకుని వస్తున్న వారిని ఆడ్డుకున్నారు. మీరు ఎందుకు వస్తున్నారు, మా గ్రామాల్లో శాంతిభద్రతల సమస్య వస్తుంది, బయట వాళ్ళు వస్తే సమాచారం ఇవ్వండి అని పోలీసులు తమకు చెప్పారని వారిని అడ్డుకున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన వ్యక్తీ, తమ వారిని ఆడుకున్నారు అంటూ కేసు పెట్టగా, పోలీసులు అత్యుత్సాహంతో, వారి పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసారు.
అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఎస్సీలుగా ఉన్న వారి పైన కూడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసే దాకా వ్యవహారం వెళ్ళింది. అయితే కేసు పెట్టిన వ్యక్తి, తాను ఎస్సీ ఎస్టీ కేసు కింద కేసు పెట్టమని చెప్పలేదని, ఈ కేసుని వెనక్కు తీసుకుంటున్నా అని చెప్పినా, పోలీసులు మాత్రం కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పారు. అయితే ఇదే సందర్భంలో రైతులకు బేడీలు కూడా వేసారు. మొత్తంగా ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ కేసు దేశ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అయితే అప్పట్లోనే రైతులకు బెయిల్ వచ్చింది. ఆ సందర్భంలోనే హైకోర్టు పోలీసులు పై అక్షింతలు వేసింది. అయితే ఇప్పుడు ఈ కేసు తదుపరి విచారణ రాగా, ఈ కేసు చెల్లదు అంటూ, హైకోర్టు ఈ కేసుని కొట్టేసింది. రైతులు పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టటానికి వీలు లేదు అంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు ఎలా పని చేస్తున్నారో చెప్పటానికి, ఇది ఒక ఉదహరణ అని అమరావతి జేఏసి, విపక్షాలు వాపోతున్నాయి. ఎన్ని సార్లు హైకోర్టులో ఎదురు దెబ్బలు తగిలినా, చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారని వాపోయారు.