న్యాయమూర్తులు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటూ, ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన కధనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తరువాత అధికార పార్టీ ఎంపీ రఘురామరాజు తన ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది అని చెప్పటం, అలాగే చంద్రబాబు, ప్రధానికి లేఖ రాయటం, హైకోర్టులో పిల్ దాఖలు కావటంతో, ఈ మొత్తం వ్యవహారం పై చర్చ జరుగుతుంది. ఈ నేపధ్యంలో, శ్రవణ్ కుమార్ వేసిన పిల్ పై , ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా, ఇరు పక్షాల నుంచి హోరా హరీ వాదనలు జరిగాయి. చీఫ్ జస్టిస్ మహేశ్వరీ నేతృత్వంలోనే బెంచ్ ఈ వదనలు విన్నది. ఈ అంశం పై దాదాపుగా 45 నిమిషాల సేపు వాదనలు జరిగాయి. అయితే ప్రభుత్వం తరుపు వాదనలు వినిపిస్తూ, ఆంధ్రజ్యోతిని కూడా పార్టీగా చేర్చాలని వాదించారు. దీని పై స్పందించిన ధర్మాసనం, ఆ కధనం చదివి వినిపించమని కోరింది. ఆంధ్రజ్యోతి కధనం పై ఫోన్ ట్యాపింగ్ కు విచారణకు ఆదేశిస్తే, మీకు వచ్చిన అభ్యంతరం ఏమిటి అంటూ కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు, పిటీషనర్ శ్రవణ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఆంధ్రజ్యోతి కధనంలో ఏమైనా తప్పు ఉంటే, మీరు తగు చర్యలు తీసుకోవచ్చు అని, మేము కూడా ఈ విచారణలో ఏమైనా తప్పు ఉంటే, చూస్తాం అని ధర్మాసనం చెప్పినట్టు చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద నేరం అని, రాజ్యంగంలో కూడా ఇది ఉందని, ఇద్దరి వ్యక్తుల మధ్య మాట్లాడే విషయం, వినే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కోసం ఒక అధికారిని ప్రభుత్వం నియమించింది అంటూ, న్యాయవాది శ్రవణ్ కోర్టుకు తెలిపారు. ఆ అధికారి పేరు చెప్పాలని కోర్టు కోరగా, ఓపెన్ కోర్టు లో చెప్పలేను అని, అఫిడవిట్ రూపంలో దాఖలు చేస్తానని చెప్పారు. అలాగే న్యాయమూర్తుల పై, షాడో పార్టీలను నియమించింది అంటూ, శ్రవణ్ కోర్టుకు తెలపటంతో, దాంట్లో ఉన్న ఆధారాలు అఫిడవిట్ రూపంలో తమకు చెప్పాలని కోర్టు తెలిపింది. 5 గురు ఫోనులు ట్యాప్ అయ్యాయి అని శ్రవణ్ చెప్పటంతో, దీని పై విచారణకు ఆదేశిస్తే మీకు అభ్యంతరం ఏమిటి అని కోరగా, తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం చెప్పటంతో, గురువారంలోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చెయ్యాలని కోరింది. ఈ కేసు విచారణ గురువారానికి వాయిదా వేసింది. దీంతో పాటు, సర్వీస్ ప్రొవైడర్ లకు కూడా నోటీసులు ఇవ్వాలని కోరింది. మొత్తంగా శ్రవణ్ కుమార్ ని అఫిడవిట్ ని దాఖలు చెయ్యమని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చెయ్యమని, సర్వీస్ ప్రొవైడర్లకు కూడా నోటీసులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ పరిశీలించి, గురువారం కోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాసం ఉంది.