జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు నుంచి మరో ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఈ సారి కోర్టు కేసుల్లో కాదు, ఇష్టం వాచినట్టు చేసిన నియామకాల విషయంలో. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ శాఖ కార్యదర్శిగా ఉంటూ, ప్రస్తుతం కాకినాడలో జిల్లా జడ్జిగా ఉంటున్న మనోహర్ రెడ్డిని హైకోర్టు సస్పెండ్ చేస్తూ, సంచలనానికి తెర లేపింది. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయశాఖ కార్యదర్శిగా ఉండగా, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించే విషయంలో భారీగా అవకతవకలకు పాల్పడినట్టు హైకోర్టు గుర్తిస్తూ, మనోహర్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకుంది. ఇలాంటి పనులు వల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్టకు భంగం కలగరాదనే ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టు స్పష్టం చేసింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, మనోహర్ రెడ్డిని తెచ్చుకుని న్యాయశాఖ కార్యదర్శి పదవి ఇచ్చారు. పదవి వచ్చిన తరువాత మనోహర్ రెడ్డి, చాలా మంది స్పెషల్ పీపీలను నియమించారు. అయితే ఇక్కడ ఎలాంటి నిబంధనలు పాటించలేదు. అప్పట్లోనే ఈయన పై ఆరోపణలు వచ్చాయి. కేవలం అధికార పార్టీ నేతల సిఫారుసుతో నియామకాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశం పై హైకోర్టుకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. న్యాయవాదులు కూడా ఫిర్యాదులు చేసారు.
ప్రతి నియామకం పై స్పష్టమైన సమాచారం హైకోర్టుకు వెళ్ళింది. ఎవరి సిఫారుసుతో ఎవరిని నియమించారు అనే విషయం పై, పూర్తి స్థాయిలో నివేదిక కోర్టుకు వెళ్ళటం, హైకోర్టు ప్రాధమిక విచారణ చేసి, అవకతవకలు ఉన్నట్టు నిర్ధారించింది. దీంతో ఆయన్ను న్యాయశాఖ కార్యదర్శి పదవి నుంచి గత ఏడాది హైకోర్టు తొలగించింది. తరువాత జిల్లా జడ్జి అయ్యారు. అయితే ఇలాంటి అవకతవకలు బయట పడితే, న్యాయశాఖ కార్యదర్శి కాబట్టి, ప్రభుత్వమే తొలగించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ రివర్స్ లో జరిగింది. ప్రభుత్వం పట్టించుకోక పోవటంతో, హైకోర్టు ఎంటర్ అయ్యింది. అయితే అప్పటికీ ప్రభుత్వమం మళ్ళీ ఆయనే కావాలని కోరినా, హైకోర్టు ఒప్పుకోలేదు. అయితే న్యాయశాఖ పదవికి మరో పేరు ప్రభుత్వం ప్రతిపాదించినా హైకోర్టు ఒప్పుకోలేదు. తాజాగా ఆయన అవకతవకలకు పాల్పడినట్టు నిర్ధారించిన హైకోర్టు, ఆయన జిల్లా జడ్జిగా కూడా ఉండకూడదు అని, సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇది ప్రభుత్వ పదవి కావటం, ప్రభుత్వం ఈ నియామకాలకు ఆమోదం ఇవ్వటం వెనుక కూడా ఏమి జరిగింది అనేది, ప్రభుత్వ పెద్దలు విచారణ చేస్తారో లేదో తెలియాలి.