విశాఖలో డాక్టర్ సుధాకర్ కు ప్రభుత్వం వైపు నుంచి జరిగిన అన్యాయం నేపధ్యంలో, ఆయన కేసుని హైకోర్టు, సిబిఐకి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ కేసు విచారణ హైకోర్టులో జరిగింది. అయితే ఈ రోజు విచారణలో భాగంగా, సిబిఐ అధికారులు ఇచ్చిన నివేదిక పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మొదటిగా, సుధాకర్ కేసుకు సంబంధించి ఏపి పోలీసులు విచారణ చేసిన సంగతి తెలిసిందే. అయితే స్థానికంగా ఉన్న పోలీసులు కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు, కేసు విషయంలో వాస్తవాలు బయటకు రావాలి అంటే, న్యాయం జరగాలంటే, ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని, సుధాకర్ తల్లితో పాటు, పౌర సంఘాలు కూడా డిమాండ్ చేసాయి. ఈ నేపధ్యంలోనే ధర్మాసనం ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తూ ఆదేశాలు జరీ చేసింది. అయితే సిబిఐ గత కొంత కాలంగా ఈ కేసు పై విచారణ చేస్తూ వచ్చింది. అనేక మందిని ఈ కేసుకు సంబంధించి విచారణ చేసారు. సుధాకర్ ని అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులు పై, మానసిక వైద్యులు నుంచి, చేసిన వైద్యం గురించి కూడా సిబిఐ అధికారులు దర్యాప్తు చేసారు. అయితే సిబిఐ ఇప్పటి వరకు చేసిన విచారణ, దర్యాప్తు జరిగిన తీరు, ఈ వివరాలు మొత్తం, సిబిఐ సీల్డ్ కవర్ లో హైకోర్టు ముందు పెట్టింది.
అయితే సీల్డ్ కవర్ లో సిబిఐ ఇచ్చిన వివరాలు, విచారణకు సంబధించిన సమాచారం పరిశీలించిన ధర్మాసనం, పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేసింది. సిబిఐ అధికారులు కూడా కేసుకు సంబంధించి విచారణ సరిగ్గా లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, దీని పై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అంతే కాకుండా హైకోర్టు కొన్ని కీలక సూచనలు కూడా చేసింది. ఈ కేసు పై ఒక పర్యవేక్షణాధికారిని నియమించాలని, ఆ అధికారికి అడిషనల్ డైరెక్టర్ స్థాయి ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణ పై పూర్తి నివేదిక తమకు మార్చి 31లోపు అందించాలని హైకోర్టు సిబిఐకి ఆదేశాలు జారీ చేస్తూ, తదుపరి విచారణ ఏప్రిల్ మొదటి వారానికి కోర్టు వాయిదా వేసింది. అప్పట్లో ఈ కేసు సంచలన కేసుగా అయ్యింది. క-రో-నా వచ్చిన కొత్తలో, డాక్టర్లకు కూడా కనీసం మాస్కులు ఇవ్వటం లేదని, డాక్టర్ సుధాకర్ అడగటం, ఆయన్ను సస్పెండ్ చేయటం, తరువాత ఆయన్ను పిచ్చి వాడిగా ముద్ర వేసి, నడి రోడ్డు మీద పడేయటం, ఇవన్నీ జరిగి, చివరకు ఈ కేసు హైకోర్టుకు చేరి, సిబిఐ విచారణ వరకు వెళ్ళింది.