రహదారుల్లో ప్రభుత్వ స్థలాల్లో విగ్రహాలు తొలగించాలని ఇప్పటికే కోర్ట్ వైసిపి ప్రభుత్వానికి మొట్టి కాయలు వేసిన సంగతి తెలిసిందే. కోర్ట్ ఆదేశాలు జారీ చేసిన తరువాత ప్రభుత్వం విగ్రహాలు తొలగించడం మొదలు పెట్టింది. కానీ ప్రభుత్వం, విగ్రహాలు తొలగించడం పై కూడా వివక్ష చూపుతుంది. దీని పై కోర్ట్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కృష్ణా జిల్లా నందిగామలో పెట్టిన అన్ని విగ్రహాలు తొలగించి, ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు మాత్రం తొలగించలేదు. విగ్రహాల తొలగించే విషయం పై కూడా ఈ వివక్ష ఏంటని, ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తే ఉపేక్షించేదే లేదని కోర్ట్ హెచ్చరించింది. ఈ విషయం పై ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని కూడా కోర్ట్ ఆదేశించింది. తాము ఈ విషయంలో కల్పించుకునే పరిస్థితి తీసుకురావద్దని కూడా హెచ్చరించింది. ప్రభుత్వం వెంటనే ఈ విగ్రహాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పోతే వెంటనే కోర్ట్ తమ ఆదేసాలను ఇస్తామని కూడా స్పష్టం చేసింది. ప్రభుత్వం వెంటనే ఇలాంటి వివక్ష ధోరణి వదలకపోతే కోర్ట్ నుంచి వచ్చే తీవ్రమయిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్ట్ తెలిపింది . న్యాయ వ్యవస్థలకు ఆగ్రహం తెప్పించే లాగా ప్రభుత్వం వ్యవహరించ కూడదని, తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చి చెప్పింది.
విగ్రహాల తొలగింపు విషయంలో ప్రభుత్వం సరైన పరిష్కార మార్గం చూపక పోతే, ఈ అంశం పై తామే ఒక కమీషనర్ ను ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఈ అంశం ప్రభుత్వం మూడు వారాల లోపు వివరణ ఇవ్వాలని చెప్పింది. ఈ మేరకు హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ , జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టు, ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలు అంటూ, అన్ని విగ్రహాలు తొలగించారు కానీ, రాజశేఖర్ రెడ్డి విగ్రహం మాత్రం తొలగించలేదు. దీంతో కోర్ట్ కు వెళ్లారు. అయతే ప్రభుత్వం వైపు నుంచి, పిటీషన్ వేసింది తెలుగుదేశం వాళ్ళని, అది రాజకీయం పిటీషన్ అని, దాని గురించి పట్టించుకోవద్దని చెప్పగా, కోర్టు స్పందిస్తూ, వాళ్ళు రాజకీయ నాయకులా ఎవరూ అనేది తమకు సంబంధం లేదని, సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించారా లేదా అనేదే తమకు కావాలని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.