ఎప్పుడా.. ఎప్పుడెప్పుడా... అని ఎదురుచూస్తున్న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సేవలు ఈ రోజు ప్రారంభం కాబోతున్నాయి. కేసరపల్లి ఎల్‌అండ్‌టీ - ఏపీఐఐసీ హైటెక్ సిటీలోని ‘మేథ’ టవర్‌లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో తన సేవలను ప్రారంభించటానికి హెచ్‌సీఎల్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న అంతర్జాతీయ కంపెనీ హెచ్‌సీఎల్ స్టేట్ స్ట్రీట్ రాష్ట్రంలో కొలువుదీరనుంది. గన్నవరం సమీపంలోని మేధాటవర్స్‌లో ఏర్పాటుకానున్న ఈ కంపెనీని ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం ప్రారంభిస్తున్నారు.
ఈ సంస్థ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. వాస్తవానికి హెచ్‌సీఎల్-అమెరికాకు చెందిన స్టేట్ స్ట్రీట్ కంపెనీలు కలిసి ఈ భాగస్వామ్య సంస్థను ఏర్పాటుచేశాయి. అమెరికా, కెనడా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హెచ్‌సీఎల్-స్టేట్ స్ట్రీట్‌లు సంయుక్తంగా ఏర్పడ్డాక మన దేశంలోని కోయంబత్తూరులో తొలిశాఖను ప్రారంభించారు. అక్కడ 4వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. కాగా, అక్టోబరు 8న హెచ్‌సీఎల్ కంపెనీ కూడా మేధాటవర్స్‌లో ప్రారంభం కానుంది. తద్వారా మరింత పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు రానున్నాయి.
గన్నవరంలోని ఆర్టీసీ జోనల్ కాలేజీ స్థలంలో శాశ్వతంగా టెక్నాలజీస్ పార్క్ నిర్మాణానికి హెచ్‌సీఎల్ మరోవైపు చర్యలు తీసుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. ఎయిర్‌పోర్టు ఉండటం వల్ల డిజైన్లకు కేంద్రం నుంచి ఇంకా కొన్ని అనుమతులు రావాల్సి ఉన్నందున ఇక్కడ శంకుస్థాపన, హైరైజ్ భవన నిర్మాణ పనులు ప్రారంభించటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ‘మేథ’ టవర్‌లో తాత్కాలికంగా తమ కార్యకలాపాలు ప్రారంభించాలని హెచ్‌సీఎల్ నిర్ణయించింది. లక్ష అడుగుల విస్తీర్ణాన్ని తీసుకుని గత ఆరు నెలలుగా పనులు చేయిస్తోంది. మేధ టవర్ పూర్తిగా ఐటీ కంపెనీలతో నిండిపోయింది. ఐదేళ్ల కిందట ఐటీ కంపెనీలు లేక వెలవెలపోయింది. రెండు మూడు చిన్న కంపెనీలు తప్పితే ఖాళీగా ఉండేది. అలాంటిది అనేక ఐటీ కంపెనీలు ఏర్పాటు కావటంతో పాటు బిగ్ ఐటీ కంపెనీగా ‘స్టేట్ స్ర్టీట్ ’ సంస్థ రంగ ప్రవేశం చేయటంతో కేసర పల్లికి మహర్దశ పట్టుకుంది.