రాష్ట్రంలో ఈ ఏడాది కౌలు రైతులకు ఖరీఫ్, రబీ సీజన్ల కింద ఇప్పటి వరకు వివిధ బ్యాంకులు రూ.4,621 కోట్లు పంట రుణాలు ఇచ్చాయి. గత నాలుగేళ్లలో కౌలు రైతులకు రూ.4,662 కోట్ల పంట రుణాలు ఇవ్వగా, ఈ ఒక్క ఏడాదిలో ఇప్పటి వరకే దాదాపు అంత ఇవ్వడం విశేషం. కౌలు రైతులకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.7,500 కోట్ల రుణాలివ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ ఏడాది తీవ్ర వర్షాభావం వల్ల సాగు అనుకూలత లేక ఖరీఫ్‌లో రైతులు పూర్తి స్థాయిలో పంటలు వేయలేకపోయారు. అలాగే, రబీ సీజన్ ముగింపు దశకు వస్తున్నా, 44% మాత్రమే పంటలు పడ్డాయి. దీంతో బ్యాంకర్లు పంట రుణాల లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు.
ఖరీఫ్‌లో 97% లక్ష్యం సాధించగా, రబీలో ఇప్పటి వరకు 46% మాత్రమే రుణాలిచ్చారు. అయితే, బ్యాంకర్ల కమిటీ లక్ష్యంలో 61% పైగా రుణాలిచ్చారు. పంటల సాగులో ఏటా కౌలురైతుల సంఖ్య పెరుగుతున్నందున, వీరికి కూడా వ్యవసాయానికి పెట్టుబడి రుణాలివ్వాలని సీఎం చంద్రబాబు బ్యాంకర్ల కమిటీని ఆదేశించారు. దీంతో రైతులతో పాటు కౌలురైతులకూ బ్యాంకర్లు రుణాలిచ్చారు. వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాల్లో దాళ్వా వరి సాగు పూర్తయ్యే నాటికి కౌలు రైతుల రుణ లక్ష్యాన్ని సాధించాలని బ్యాంకర్ల కమిటీ భావిస్తోంది. ఈ ఏడాది కృష్ణా జిల్లాలో అత్యధిక సంఖ్యలో కౌలు రైతులకు పంట రుణాలు లభించాయి.
అయితే, రుణ మొత్తంలో పశ్చిమ గోదావరి జిల్లా కౌలురైతులకే అధికంగా దక్కింది. తర్వాతి స్థానంలో తూర్పుగోదావరి జిల్లా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఎల్‌ఈసీ, సీవోసీ కార్డులన్న కౌలురైతులు, రైతు మిత్ర, జాయింట్ లైబిలిటీ గ్రూపులకు చెందిన 10,46,420 మందికి రూ.4621.8 కోట్లు పంపిణీ చేశారు. అందులో పశ్చిమగోదావరి జిల్లాలో 2,87,995 మందికి రూ.1550.4 కోట్లు ఇవ్వగా, కృష్ణా జిల్లాలో 3,41,151 మందికి రూ.1360.2కోట్లు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో 2,49,012 మందికి రూ.856.8 కోట్లు ఇచ్చారు. అనంతపురం జిల్లాలో అతితక్కువగా 408 మందికి రూ.4.3కోట్లు అందాయి.