హీరో నాగార్జున ఉన్నట్టు ఉండి తాడేపల్లిలో ప్రత్యక్షం అయ్యారు. కొద్ది సేపటి క్రితం నాగార్జున ప్రత్యేక విమానంలో, గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. నాగార్జునతో పాటు నిరంజన్ రెడ్డి కూడా ఉన్నారు. వీరు కొద్ది సేపటి క్రితం గన్నవరం నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. సియం క్యాంప్ ఆఫీస్ లో, జగన్ మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం క్యాబినెట్ సమావేశంలో అమరావతి సచివాలయంలో ఉన్నారు. జగన్ అక్కడ నుంచి వచ్చిన తరువాత, వీళ్ళతో భేటీ అయ్యే అవకాసం ఉంది. సాయంత్రం 5.30 గంటలకు జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ తో భేటీ కాబోతున్నారు. ఈ మధ్యలోనే, వీరితో భేటీ అయ్యే అవకాసం ఉంది. అయితే నాగార్జున ఎందుకు వచ్చారు అనేది మాత్రం అంతుబట్టటం లేదు. సినిమా పరిశ్రమ గురించి అయితే, ఇతర హీరోలు, ఇతర నిర్మాతలు కూడా రావాలి కానీ, ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున ఎందుకు వచ్చారు అనేది తెలియాల్సి ఉంది. మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ లో వచ్చారు. ఆయన సొంత పనులు మీద వచ్చారా ? లేదా సినీ పరిశ్రమకు , జగన్ కు మధ్య ఉన్న గ్యాప్ ని చెరిపేయటానికి వచ్చారా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల జగన్ తీసుకున్న నిర్ణయం పై, పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, సినీ పరిశ్రమ జోలికి రావద్దు అంటూ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
మరో పక్క ఆన్లైన్ లో ఏపి ప్రభుత్వమే, సినిమా టికెట్లు అమ్మే విధానం పై కూడా విమర్శలు వస్తున్నాయి. దీని పై ఈ రోజు క్యాబినెట్ లో కూడా నిర్ణయం తీసుకోనున్నారు. మరో పక్క బెనిఫిట్ షోల పై కూడా వివాదం ఉంది. ఈ మొత్తం అంశాల పై, సినిమా పరిశ్రమ, ఏపి ప్రభుత్వం మధ్య ఉన్న వివాదం నేపధ్యం, ఈ వివాదాలు మొత్తం నేపధ్యంలో, నాగార్జునను ముందు పెట్టి, సినీ పరిశ్రమ సమస్య పరిష్కారం చేసుకుంటుందా అనే చర్చ మొదలైంది. నాగార్జున మొదటి నుంచి జగన్ కు సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఈ నేపధ్యంలోనే జగన్ తో భేటీ కోసమే ఈ పర్యటనగా తెలుస్తుంది. మరి కొద్ది సేపట్లో ఈ భేటీ జరిగిన తరువాత కానీ, అసలు నాగార్జున ఎందుకు వచ్చారు అనే విషయం పై క్లారిటీ వచ్చే అవకాసం ఉంది. మరో పక్క నాగార్జున వ్యక్తిగత పని మీద వచ్చారు అనే చర్చ కూడా జరుగుతుంది. విశాఖలో స్టూడియో నిర్మాణం కోసం, భూములు కోసం, నాగార్జున జగన్ ను కలవటానికి వచ్చారా అనే చర్చ కూడా జరుగుతుంది. మొత్తంగా నాగార్జున స్పందిస్తే కానీ అసలు విషయం తెలియదు.