ఆగ్రిగోల్ద్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులను జిల్లా కమిటీ ద్వారా విక్రయించాలని ఉమ్మడి హైకోర్టు నిర్ణయించింది. జిల్లా కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిలతో కూడిన కమిటీ వేలం ప్రక్రియ నిర్వహించాలని, వీరికి సీఐడీ అధికారి ఒకరు సహకారం అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మొదటి విడతలో కృష్ణా జిల్లాలో గుర్తించిన అయిదు ఆస్తుల వేలానికిగాను కమిటీకి సిఫారసు చేసింది. రూ.కోట్ల డిపాజిట్‌లు స్వీకరించి చేతులెత్తేసిన అగ్రిగోల్డ్ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది.
గత విచారణలో.. జిల్లా కమిటీల ద్వారా ఆస్తులను విక్రయించాలన్న ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రతిపాదనకు ధర్మాసనం ఆమోదం తెలిపింది. అయితే జిల్లా జడ్జి స్థానంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఉంటారని వెల్లడించింది. మొదటి విడతగా కృష్ణా జిల్లా గాంధీనగర్‌లోని వాణిజ్య షెడ్, స్థలం కలిపి 1712 చదరపు గజాలు, మచిలీపట్నంలో ప్లాట్, విజయవాడ మొగల్రాజపురంలో భవనం, మచిలీపట్నంలో ప్లాట్, వీర్లపాడు మండలంలో వ్యవసాయ భూమి, విజయవాడ పాయకాపురంలో ఖాళీ ప్లాట్‌లను వేలం వేయాలని కమిటీకి సూచించింది. దీనిపై రెండు వారాల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని, రెండు తెలుగు పత్రికల జిల్లా ఎడిషన్‌లలో వేలం గురించి తక్కువ ఖర్చుతో సంక్షిప్త ప్రకటన ఇవ్వాలని, పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచి అదే విషయాన్ని ప్రకటనలో తెలియజేయాలని సూచించింది.
సీఐడీ మొత్తం 10 ఆస్తులను సిద్ధం చేసి విలువలను కోర్టుకు సమర్పించగా, అవి తక్కువగా ఉన్నాయంటూ అగ్రి యాజమాన్యం తెలిపింది. 10 ఆస్తుల్లో రెండు ఆంధ్రాబ్యాంకు తాకట్టులో ఉన్నాయని, ఒకటి ఇప్పటికే అమ్మివేసినట్లు వారి తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ చెప్పారు. ఆస్తుల జప్తు జరగకముందే విక్రయించినట్లు చెప్పారు. అది రిజిస్టర్ కాలేదని ఏపీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ విక్రయ దస్తావేజును సమర్పించాలంటూ యాజమాన్యం తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ప్రభుత్వం, యాజమాన్యం సమర్పించిన ఆస్తుల విలువలు రెండు మినహా మిగిలినవి దగ్గరగా ఉండటంతో వాటి విక్రయానికి అనుమతించింది. ధరలో వ్యత్యాసం ఎక్కువగా ఉన్న వాటి గురించి వచ్చే విచారణలో పరిశీలిస్తామని పేర్కొంటూ విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.