అమరావతిని నిర్వీర్యం చెయ్యటానికి, జగన్ మోహన్ రెడ్డి, ఏ నిమిషాన నిర్ణయం తీసుకున్నారో కాని, అప్పటి నుంచి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఏదో ఒక రూపంలో ప్రతి రోజు, ఏదో ఒక చెడ్డ వార్తా , జగన్ కు వినిపిస్తూనే ఉంది. వెంటనే విశాఖ వెళ్లిపోదాం అని అనుకుంటున్న జగన్ కు, ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నిన్న హైకోర్ట్ మాట్లాడుతూ, హైకోర్ట్ శాశ్వత భవనాలు నిర్మాణం కొనసాగించండి అంటూ, ఇచ్చిన ఆదేశాలతో జగన్ షాక్ తిన్నారు. ఒక పక్క కర్నూల్ కు హైకోర్ట్ తీసుకు వెళ్దాం అని జగన్ అనుకునుంటే, కోర్ట్ మాత్రం, వాదనలు వింటూ ఉంటాం, కాని అమరావతిలో మాత్రం, శాశ్వత హైకోర్ట్ పనులు కొనసాగించండి అంటూ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరో పక్క అసెంబ్లీలో బిల్లు పెట్టేసి, మూడు ముక్కల రాజధాని చేద్దాం అనుకుంటే, శాసనమండలి బ్రేక్ పెట్టింది. అయితే శాసనమండలినే రద్దు చేసి పడేసారు. కాని ఇప్పుడు ఇది కేంద్రం కోర్ట్ లో ఉంది. కేంద్రం రద్దు చేసే నిర్ణయం పై, ఇప్పుడే పార్లమెంట్ లో పెట్టే పరిస్థితి లేదు.
ఇలా ఉంటే, ఈ రోజు మరో షాక్ తగిలింది. కొండవీటి, పాలవాగు పనులు ఎందుకు ఆపారు, ఆ పనులు పూర్తి చేయాలి అంటూ హైకోర్టు ఈ రోజు ఆదేశాలు ఇచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు 4 వారాల్లోగా పనులు పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. కొండవీటి, పాలవాగుల పనుల్ని మధ్యలోనే ఆపేయటం వల్ల రాజధాని గ్రామాల్లో కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయని హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చినా కొండవీటి, పాలవాగు పనులు చేయకుండా, నిలిపివేసారని హైకోర్టు దృష్టికి న్యాయవాది తీసుకొచ్చారు. అయితే ఈ విషయం పై వివరణ ఇవ్వటానికి, తమకు రెండు వారాల గడువు కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్ట్ ని కోరారు.
అయితే ఈ విషయం పై, హైకోర్ట్ ఒప్పుకోలేదు. రెండు వారల గడువు ఇవ్వటానికి హైకోర్ట్ నిరాకరించింది. 4 వారాల్లోగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయాలని న్యాయమూర్తి కోరారు. 4 వారాల్లో ఈ ఆదేశాలు అమలు చేసి నివేదిక ఇవ్వాలని, లేకపోతే సీఆర్డీఏ కమిషనర్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఇప్పుడు అమరావతిలో ఆపేసిన కొండవీటి, పాలవాగుల పనుల్ని మళ్ళీ కొనసాగించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది. అమరావతి వరదలు బారిన పడకుండా, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్ సహాయంతో, కొండవీటి, పాలవాగులు వెడల్పు చేస్తూ, నిర్ణయం తీసుకుంది. పనులు కూడా తెలుగుదేశం హయంలో పరుగులు పెట్టిన సంగతి తెలిసిందే.