జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి టైం అసలు కలిసి రావటం లేదు. అటు కేంద్రం కాని, ఇటు కోర్ట్ లు కాని, ఏవి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించటం లేదు. కేవలం చంద్రబాబుని ఇరికిద్దాం అంటూ జగన్ వేస్తున్న అడుగులు, ప్రతి సారి రివెర్స్ అవుతున్నాయి. చంద్రబాబు పై అవినీతి మరకలు వెయ్యటం ఏమో కాని, రాష్ట్ర పరువు అటు కేంద్రం దగ్గర, ఇటు కోర్ట్ ల్లో కూడా పోతుంది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే, చంద్రబాబు విద్యుత్ కొనుగోల్లలో పెద్ద ఎత్తున అవినీతి చేసారని, ఆ అవినీతి అంతా బయటకు తీస్తాం అంటూ కొన్ని చర్యలు తీసుకున్నారు. విద్యుత్ ఒప్పందాలు సమీక్ష చేస్తున్నాం అంటూ ఒక కమిటీ వేసారు. అంతే కాదు, రెట్లు అన్నీ సమీక్ష చేస్తున్నాం అంటూ ఒక జీవో కూడా విడుదల చేసారు. దీని పై అటు పెట్టుబడి పెట్టిన కంపెనీలు కాని, ఇటు కేంద్ర ప్రభుత్వం కాని తీవ్ర అభ్యంతరం చెప్పాయి. కేంద్ర ప్రభుత్వం అయితే, ఒకింత గట్టిగానే సమాధానం ఇచ్చింది.
మీ ఇష్టం వచ్చినట్టు సమీక్ష చెయ్యటం కుదరదు, అన్నీ సక్రమంగానే జరిగాయి, అసలు రేట్లు నిర్ణయించేది రాష్ట్రం కాదు అంటూ గట్టిగా చెప్పింది. మొన్న కేంద్ర మంత్రి కూడా, జగన్ అన్నీ అసత్యాలు చెప్తున్నారు అంటూ, ఏకంగా ప్రెస్ ముందే చెప్పారంటే, ఈ విషయంలో కేంద్ర వైఖరి ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. అయితే కేంద్రం ఎంత హెచ్చరిస్తున్నా, బిజినెస్ అనలిస్ట్ లు ఎంత హెచ్చరించినా, జగన్ మాత్రం తన వైఖరి మార్చుకోలేదు. దీంతో దాదాపుగా 42 విద్యత్ కంపెనీలు హైకోర్ట్ తలుపు తట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనుల పై కోర్ట్ కు నివేదించాయి. ఈ విషయం పై, ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్ట్, ఫైనల్ తీర్పు కూడా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇస్తూ, ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసింది.
విద్యుత్ ఒప్పందాల పై పీపీఏల పునఃసమీక్ష పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు జీవోను హైకోర్టు కొట్టి వేసింది. అలాగే గత నాలుగు నెలలుగా విద్యుత్ సంస్థలకు చెల్లింపులు చెయ్యటం లేదని తెలియటంతో, వారికి చెల్లింపులు కూడా చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వారి నుంచి ప్రభుత్వం విద్యుత్ తీసుకోవటం లేదని తెలిసి, అది తక్షణమే విద్యుత్ కూడా తీసుకోవలాని కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా పీపీఏల టారిఫ్ వ్యవహారాన్ని 6 నెలల్లో పరిష్కరించాలని ఈఆర్‌సీని హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదాన్ని ఇక కోర్ట్ లో కాకుండా ట్రిబ్యునల్ లో పరిష్కరించుకోవాలని కోరింది. మొత్తానికి, విద్యుత్ ఒప్పందాల విషయంలో జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కోర్ట్ తప్పుబట్టింది.