అమరావతి విషయంలో, నిన్న మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేస్తూ, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం పై, రాష్ట్ర హైకోర్టులో అనేక కేసులు నమోదు అయ్యాయి. నిన్న దాదాపుగా 32 పిటీషన్లు, ఇదే అంశం పై, నమోదు కావటంతో, వాటి అన్నిటి పై విచారణ జరిపిన హైకోర్టు ఫుల్ బెంచ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా, అమరావతి ఖర్చు వివరాలు అడగటం, మరో కొత్త పరిణామం. అమరావతి పరిరక్షణ సమితి విజ్ఞప్తి మేరకు, హైకోర్టు స్పందిస్తూ, "అకౌంటెంట్ జనరల్" ను ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలని, ఆయన నుంచి తమకు వివరాలు కావాలి అంటూ, అమరావతి నిర్మాణానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుందని అంచనా వేసారు, ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, ఎన్ని ఫేసేజ్ లో ఈ ఖర్చు ఉంటుంది, లాంటి పూర్తి అంశాల పై, తమకు వివరాలు సమర్పించాలని, దీనికి ప్రతివాదిగా "అకౌంటెంట్ జనరల్" ను చేర్చాలని ధర్మాసనం ఆదేశించింది.
అయితే ఈ సమయంలో జోక్యం చేసుకున్న ప్రభుత్వ తరుపు అడ్వొకేట్ జెనెరల్, ఇప్పటికే మేము ఈ వివరాలు అన్నీ సమర్పించామని, మళ్ళీ "అకౌంటెంట్ జనరల్" ఎందుకు అనే విధంగా మాట్లాడారు. దీనికి స్పందించిన హైకోర్టు, మేము ఈ విషయం పై ఇప్పటికిప్పుడు ఏమి విచారణ చెయ్యటం లేదని, "అకౌంటెంట్ జనరల్" ను కూడా పూర్తి వివరాలు అడిగాము, ఆయన ఇచ్చిన సమాచారం కూడా మేము పరిశీలిస్తాం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందుకే ఈ కేసులో "అకౌంటెంట్ జనరల్" ను కూడా ప్రతివాదిగా చేర్చాలని, చెప్తూ, ఈ కేసుని ఆగష్టు 6కి వాయిదా వేసింది. అప్పటి లోపు తమకు పూర్తి సమాచారం ఇవ్వాలని కోరింది. అయితే ఈ అంశం వెలుగులోకి వస్తే, ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన 10 వేల కోట్లు ఖర్చు వేలుగోలోకి వస్తుంది. మధ్యలో ఉన్న నిర్మాణాల గురించి కోర్టు అడుగుతుంది. అలాగే సేల్ఫ్ ఫైనాన్సు ప్రాజెక్ట్ గురించి కోర్టుకు అర్ధం అవుతుంది. మరి ఈ అంశాలు అన్నిటి పై, ప్రభుత్వం, ఎలా సమాధానం చెప్తుందో చూడాలి.