ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుకు వారం రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే నోటిఫికేషన్ ముసాయిదాకు మార్పులు చేసిన కేంద్ర న్యాయశాఖ తుది ప్రకటన సిద్ధచేసినట్లు సమాచారం. త్వరలో ఈ ప్రకటన ఆమోదం కోసం రాష్ట్రపతి వద్దకు పంపనున్నారు. ఏపీలో హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేస్తారు, తదితర వివరాలు నోటిఫికేషనో ఉంటాయి. ప్రకటన జారీ తర్వాత మూడు మాసాల్లోపు ఏపీ హైకోర్టు తరలింపు ఉంటుందని విశ్వసనీయ సమాచారం. ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని నేలపాడు వద్ద నిర్మిస్తున్న ఏపీ హైకోర్టు భవనాన్ని ఈనెల 15 నాటికి పూర్తి చేస్తామని సర్కారు సుప్రీంకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డిసెంబర్ చివరకు భవనం పూర్తి కానున్నట్లు సమాచారం.
నేలపాడులో నిర్మిస్తున్న హైకోర్టు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. డిసెంబర్ 15 నాటికి భవనం పూర్తవుతుందని చెప్పిన ప్రభు త్వం, ఇప్పుడు డిసెంబర్ 31 నాటికి భవనం సిద్ధమ వుతుందని చెబుతోంది. ‘నోటిఫికేషన్ వెలువడటం అన్నదే ముఖ్యం. కేంద్రం నిర్ణయించిన విధంగా ఈ వారంలో నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఇదే సమయంలో హైకోర్టు తరలింపునకు 90 రోజుల గడువు ఎలానూ ఉంది. కాబట్టి ఈ వారం రోజుల్లోపు నోటిఫికేషన్ వచ్చినా, రాబోయే 3 నెల ల్లోపు ఎప్పుడైనా అమరావతికి హైకోర్టును తరలించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆలోచన తోనే ఉంది’’ అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
మరో పక్క, రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న హైకోర్టు భవన నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రీకాస్ట్ టెక్నాలజీతో శరవేగంగా నిర్మిస్తున్నామన్నారు. ఈ నెల 31 నాటికి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు, రైతులకు ఇచ్చిన ప్లాట్లలో రోడ్ల నిర్మాణ పనులు 1600 కిలోమీటర్ల మేర పూర్తి అయ్యాయన్నారు. మార్చి నాటికి మిగిలిన రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాజధాని నిర్మాణ పనులను చూసి మాట్లాడాలని విపక్షాలకు సూచించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు.