కేవలం పబ్లిసిటీ, కోసమో, డబ్బులు దండుకోవడం కోసమో ప్రజాహిత వ్యాజ్యాలను వేస్తే సహించేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రైతు అనే ఒకే ఒక్క కారణంతో వదిలి పెడుతు న్నామని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇకపై మంచి పౌరుడిగా జీవించాలని పిటిషనర్‌కు హైకోర్టు హితవు చెప్పింది. ఈ వ్యాజ్యంలో ఎలాంటి ప్రజా హితం లేదు. కేవలం ఇది బ్లాక్ మెయిల్ వ్యాజ్యం మాత్రమేనని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. వ్యవసాయం పొలాల్లో చేయాలి. కానీ కోర్టుల్లో కాదని హైకోర్టు అభిప్రాయపడింది. అయితే కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి రూ.లక్ష జరిమానా చెల్లించాలని పిటిషనర్‌ను ఆదేశించాలని భావించినప్పటికీ కేవలం వ్యవసాయదారుడనే కారణంతో మినహాయిస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది.
ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్.రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్ వి.భట్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. అల్ట్రా టెక్ సిమెంట్ కంపెనీలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలివేసి, అదే కంపెనీ పై గతేడాది వేసిన రిట్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే ప్రజాహిత వ్యాజ్యం వేయడం పట్ల ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం భోగసముద్రం గ్రామం దగ్గర ఉన్న అల్ట్రాటెక్ సిమంట్ కంపెనీ నుంచి వెలువడుతున్న దుర్గంధపూరితమైన వాయువులు వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని పేర్కొంటూ కర్నూలు జిల్లా కొలిమిగండ్ల మండలం అంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన బి.జనక శంకర్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఇదే అంశంపై పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే కోర్టుకు తెలపకుండానే మరో పిల్ దాఖలు చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. పిటిషనర్ సదుద్దేశాన్ని నిరూపించుకునేందుకు రిజిస్ట్రీ వద్ద రూ.లక్ష డిపాజిట్ చేయాలని గత విచారణ సందర్భంగా ధర్మాసనం పిటిషనర్‌ను ఆదేశించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… గతేడాది దాఖలు చేసిన రిట్ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టలేదన్నారు. అయితే ఆ విషయాన్ని కోర్టుకు చెప్పకపోవడం పొరపాటేనని విన్నవించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనర్ కేవలం వ్యవసాయదారుడనే ఒకే ఒక్క కారణంతో వదిలి వేస్తున్నట్లు స్పష్టం చేసింది.