హై కోర్ట్, సుప్రీం కోర్ట్, ఇలా అన్ని కోర్టుల్లో కేంద్రానికి ఇబ్బంది ఎదురు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని పలు నిబంధనలను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. చట్ట నిబంధనలను ఎందుకు అమలు చేయడంలేదో చెప్పాలని పేర్కొంటూ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, హోంశాఖ, న్యాయశాఖ కార్యదర్శులు, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంతోపాటు ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్ట నిబంధనలను అమలు చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన పోలూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సోమవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున న్యాయవాది పి.వి.కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు పన్ను మినహాయింపుతో పాటు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాల్సి ఉన్నా కేంద్రం ఆ మేరకు వ్యవహరించడంలేదన్నారు.
పోలవరం ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం నిర్మించాల్సి ఉండగా రాష్ట్రప్రభుత్వం ఆ బాధ్యతలను తీసుకోవడం చట్ట నిబంధనకు విరుద్దమన్నారు. నూతన రాజధాని నిర్మాణానికి ఆర్థికసాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. రైల్వేజోన్ ఏర్పాటు వ్యవహారంలోను నిబంధనలు అమలుకాలేదన్నారు. ఇదే తరహాలో చట్టంలోని పలు నిబంధనలు అమలుకావడం లేదన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పందన తెలుసుకుంటామని పేర్కొంది. నోటీసులు జారీచేస్తూ విచారణను వాయిదా వేసింది.