ఓటర్ల జాబితాకు అనుసంధానం చేసిన ‘ఆధార్’ డేటా’ను తొలగించాలనే ఆదేశాలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఓటర్ల జాబితా సవరణకు ఏ రకమైన సాఫ్ట్‌వేర్ ను వినియోగిస్తున్నారో వివరిస్తూ కౌంటర్ వేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై కొడాలి శ్రీనివాస్ గత ఏడాది హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది. డూప్లికేట్ ఓటర్లను తొలగించేందుకు ఈసీ ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసిందనీ, దాని ఆధారంగా తెలంగాణలో 27 లక్షలు, ఏపీలో 19 లక్షల ఓట్లను తొలగించారనీ పిటిషనర్ తరఫు న్యాయవాది అర్జున్‌రెడ్డి కోర్టుకు విన్నవించారు.
కేంద్ర ఎన్నికల సంఘం, ఉభయ రాష్ర్టాల ఎన్నికల కమిషన్లు పౌరులను తప్పుదారి పట్టించాయని, పెద్ద ఎత్తున అర్హులైన ఓటర్లను తొలగించారని ఆయన కోర్టుకు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ‘సమగ్ర కుటుంబ సర్వే’ ఏపీలో ‘స్మార్ట్ పల్స్ సర్వే’ పేరిట ప్రజల నుంచి వివరాలు సేకరించారనీ, ఈ సర్వేలో ఆధార్ సంఖ్య, ఓటరు గుర్తింపు కార్డు, ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్, పాన్ కార్డు వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి వాటిని స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్‌ఆర్‌డీహచ్) వద్ద భద్రపర్చారని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఈ డేటాను ఓటరు జాబితా రూపకల్పన నిమిత్తం కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చినట్లు తెలిపారు. ఆధార్ సంఖ్యను కేవలం సబ్సిడీ పథకాలకే వర్తింపచేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందనీ, కానీ ప్రజల నుంచి ఎటువంటి అనుమతి లేకుండానే ఆధార్ సమాచారాన్ని ప్రభుత్వాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చాయని పిటిషనర్ పేర్కొన్నారు.
ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం... ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించిన సమాచారాన్ని ఎన్నికల సంఘంతో పంచుకుంటే తప్పేంటనీ, దాని ప్రభావం ఓటరు జాబితా రూపకల్పనపై ఎలా పడుతుందని ప్రశ్నించింది. ఈసీ తరఫు న్యాయవాది వాదిస్తూ... జాబితాలో తొలగింపులు, చేర్పులు వంటివి ఈఆర్‌వో చూస్తారన్నారు. ఈసీ వద్దనున్న డేటాను చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా... ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో వ్యక్తితో పంచుకునే ప్రసక్తే లేదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ కులాలు, వర్గాల వారీగా ఓటర్ల జాబితాలో పేర్లను తొలగిస్తున్నారన్న ఆరోపణలతోపాటు ఓటర్ల చేర్పులు, తొలగింపులు, ఈఆర్‌ఓకు ఉన్న అధికారాలు, ఓటర్ల జాబితాను రూపొందించడానికి అనుసరిస్తున్న సాంకేతిక విధానం తదితరాలతో కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది.