వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును కోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా జరిపించాలని కోరుతూ ప్రజాహిత వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన పిటిషనర్‌కు హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. వ్యాజ్యం దాఖలు చేయడానికి ఉన్న అర్హతేమిటో చెప్పాలని ఆదేశించింది. కోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో విఫలమైన పిటిషనర్ తరఫు న్యాయవాది.. పూర్తి వివరాలతో అదనపు ప్రమాణపత్రం దాఖలు చేసేందుకు గడువు కావాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును కోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా జరిపించాలని కోరుతూ అనీల్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు ప్రారంభిస్తున్న సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వ్యాజ్యం దాఖలు చేయడానికి పిటిషనర్‌కు ఉన్న అర్హతేమిటని ప్రశ్నించింది. ప్రజా సమస్యలపై పోరాడతారని, విశాఖ విమానాశ్రయంలో వైకాపా అధ్యక్షుడు జగన్‌పై జరిగిన దాడి ఘటనపై పిల్ దాఖలు చేశారని పిటిషనర్ తరుఫు న్యాయవాది తెలిపారు. అంతమాత్రాన సీబీఐ దర్యాప్తు కోరడానికి అర్హత ఉందని ఎందుకు అనుకుంటున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. మరో న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. వివేకానందరెడ్డి భార్య/కుటుంబ సభ్యులు.. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ ఓ వ్యాజ్యం దాఖలు చేస్తున్నారని ఆ వ్యాజ్యంపై విచారణ జరపాలని కోరారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.