కొడంగల్‌లో అర్థరాత్రి హై డ్రామా నెలకొంది. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యూసుఫ్ నివాసంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలు నిర్వహించారు. నగదు ఏమీ లభించకపోవడంతో వారు వెనుదిరిగారు. రేవంత్ రెడ్డికి యూసుఫ్ ప్రధాన అనుచరుడు కాబట్టే యూసుఫ్‌కు సంబంధించిన వారి ఇళ్లల్లో దాడులు చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సెర్చ్ వారెంట్ చూపించకుండానే ఇళ్లల్లోకి చొరబడ్డారని, మహిళలతో దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. సోదాలు జరిపినా ఏమీ లభించలేదని రాసి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ఎస్‌ఐ కాశికి సమాచారం అందడంతో, ఆయన వచ్చి అదుపుచేసేందుకు యత్నించారు. అదే సమయంలో రేవంత్‌రెడ్డి తన ప్రచారం ముగించుకొని అక్కడికి చేరుకున్నారు. తమ కార్యకర్తలను పోలీసులు భయాందోళనకు గురిచేసేలా ప్రవర్తిస్తున్నారంటూ రోడ్డుపై బైఠాయించారు. అదే సమయంలో బొంరాస్‌పేటలోనూ పోలీసులు, ఆబ్కారీ సిబ్బంది రేవంత్ అనుచరుడైన రాంచందర్‌రెడ్డి ఇంట్లో సోదాలు జరిపారు. ఏమీ లభించకపోవడంతో వెనుదిరుగుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుల వాహనాన్ని చుట్టుముట్టారు. కావాలనే రాత్రిపూట వచ్చి భయాందోళనలు సృష్టిస్తున్నారంటూ అక్కడే బైఠాయించారు. రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి అక్కడికి వచ్చి మద్దతు పలికారు. అర్ధరాత్రి వరకు కొడంగల్, బొంరాస్‌పేటలలో ధర్నా కొనసాగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో, రెండుచోట్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.
గత సోమవారం గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతా్‌పరెడ్డి తనయుడి ఇంట్లోనూ పోలీసులు చొరబడి సోదాలు చేశారు. ఈ సందర్భంగా తనను పోలీసులు వేధిస్తున్నారంటూ ప్రతా్‌పరెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశారు. ఆయన ఇంట్లో ఏమీ దొరక్కపోవడంతో పోలీసులు ఒట్టి చేతులతో వెళుతుంటే ఇంట్లో ఏం దొరికిందో చెప్పాలంటూ కార్యకర్తలు అడ్డుపడి నిలదీశారు. ‘‘ఎవరు ఫిర్యాదు చేశారో చెప్పరు. సోదాలు ఎందుకు చేస్తున్నారో చెప్పరు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పరు. అయినా ఎన్నికల సమయంలో పోలీసులు సోదాలు చేయడం ఏమిటి? గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు’’ అంటూ విపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. ఒంటేరు ప్రతా్‌పరెడ్డి గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఢీకొంటుండగా, రేవంత్‌రెడ్డి రాజకీయంగా కేసీఆర్ కుటుంబాన్ని ఢీకొంటున్నారు.