ఆంధ్రప్రదేశ్‌లో టౌన్‌షిప్‌లు, గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ఆసక్తిగా వున్నామని జపాన్ ఆతిధ్య రంగ దిగ్గజం యుకో హిరా తెలిపారు. దీంతో పాటు గృహ నిర్మాణం, ప్రజారవాణా, మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెడతామని చెప్పారు. ‘ఇండియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అసోసియేషన్ జపాన్’ (ఐ.సి.ఐ.జె.) చైర్మన్‌గా వున్న యుకో హిరా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలపై సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి చర్చించారు. హెచ్ఎంఐ హోటల్ గ్రూపు నిర్వహిస్తున్న యుకో హిరా జపాన్‌లో పెరల్ సిటీ, క్రిస్టొన్, క్రౌన్ ప్యాలస్ తదితర ప్రీమియం హోటళ్లకు అధినేతగా వుండటమే కాకుండా ప్రవాస భారతీయ కార్పొరేట్ దిగ్గజంగా ఫోర్బ్స్ జాబితాలో నిలిచారు.
ప్రస్తుతం అక్కడ 60కి పైగా హోటళ్లు నిర్వహిస్తున్న యుకో హిరా విశాఖలో తొలుత గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫార్మా పరిశ్రమకు ముఖ్యకేంద్రంగా వున్న జపాన్‌లోని తొయామా నగరంతో ఏపీకి సామీప్యత వుందని, సుదీర్ఘ సముద్రతీరం ఇరు ప్రాంతాలకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని యుకో వివరించారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలో రెండు ప్రాంతాల మధ్య పరస్పర సహాయ సహకారాలు అవసరమని అభిప్రాయపడ్డారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధిక నాణ్యత గల సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వ సహకారం ఉంటే ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధమని తెలిపారు.
జపాన్-ఏపీ పరస్పర వాణిజ్య సంబంధాలకు ఇతోధికంగా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలు, వాణిజ్యం వేర్వేరు దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. కొత్త రాష్ట్రానికి సహకారం అందించేందుకు సింగపూర్ ముందుకు వచ్చినట్టే జపాన్ కూడా చొరవ చూపి రావాలని, ఇక్కడున్న విస్తృత పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఐసీఐజే చైర్మన్‌ను కోరారు. సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి కార్య నిర్వహణాధికారి జాస్తి కృష్ణకిశోర్ పాల్గొన్నారు.