‘ప్రధాని నరేంద్రమోడీ ఎవరేం చెప్పినా వినిపించుకునే స్థితిలో లేరు. ఏపీకి సాయం చేస్తే ఎక్కడ గుజరాత్ కంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతుందో అన్న ఆందోళన ఉంది. కొందరు అవినీతి నాయకులు చెప్పిన మాటలు విని ఏపీ అభివృద్ధిని ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకుంటున్నారు. విభజన హామలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని ఢిల్లీ వెళ్లి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా… విన్నవించుకున్నా… వినిపించుకోలేదు…” అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీలు పార్లమెంటులో అవిశ్వాసం పెట్టి పోరాడకుండా కేసుల భయంతో పారిపోయారని, అయితే టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని గమనించిన దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పక్షాలు, దాదాపు 125 మంది ఎంపీలు మద్దతిచ్చారన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. బేషరతుగా కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీ పోరాటానికి మద్దతిచ్చిందన్నారు. ఇది ప్రాథమికంగా మనం సాధించిన విజయమన్నారు.
తెగతెంపులతోనే వేధింపులు… ‘రాష్ట్ర విభజన కష్టాల నుంచి గట్టెక్కిస్తారనే బీజేపీతో 2014 ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్నాం. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి న్యాయం చేస్తామని నరేంద్రమోడీ ప్రతి ఎన్నికల సభలో హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్ల పాటు కాలయాపనతో మోసం చేశారు’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ నిధులు విడుదల చేయకుండా కేంద్రం వేధిస్తోందని మండిపడ్డారు. ఏకంగా రూ.3,400 కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు. ఇప్పటికే 63 శాతం పనులు పూర్తయ్యాయి. మొదటి గేటు ఏర్పాటు చేశాం. పోలవరం పనులు ఆపం. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వంతోపాటు రాష్ట్రంలోని ప్రతిపక్షపార్టీ కుట్రలు పన్నుతోందన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వాటిని ఛేదిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు, రెవెన్యూలోటు, రైల్వే జోన్, కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్, అనంతపురం జిల్లాలో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్, యూనివర్శిటీలు ఇలా అన్నింటా మోసం చేశారని ధ్వజమెత్తారు. విద్యా సంస్థలకు రూ.11 వేల కోట్లు అవసరం. ఇంతవరకు కేంద్రం కేవలం రూ.600 కోట్లు ఇచ్చింది. ఇలాగైతే మూడు దశాబ్దాలు గడచినా వాటి నిర్మాణాలు పూర్తి కావు. అయినా భయపడం. రాష్ట్రమే సొంతంగా రూ.50 వేల కోట్ల పెట్టుబడితో రాజధాని పనులు చేస్తోంది. రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు భూములు ఇచ్చారు. అలా ఇచ్చిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కట్టడానికి కేంద్రానికి మనసు ఒప్పడం లేదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వస్తోంది. గురువారం శంకుస్థాపన చేస్తాం. అలాగే అమరావతిలో ప్రపంచంలోనే సుందరమైన, ఎత్తైన సెక్రటేరియట్‌ను నిర్మించడానిక కూడా అప్పుడే శంకుస్థాపన చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. మనకు న్యాయం జరగాలంటే కేంద్రం నుంచి నిధులురావాలంటే బీజేపీ ప్రభుత్వం పడిపోవాలి.