ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుని సందర్శించటానికి రాష్ట్ర ప్రజలు అందరికి అవకాశం కల్పిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ ఉచితంగా సందర్సించాలి అనుకునేవారు ముందుగా ఒక అసోసియేషన్‌గా ఏర్పడాలి. లేదా అమలులో వున్న ఏదో ఒక అసోసియేషన్ ద్వారా అయినా వెళ్ళవచ్చు. అంటే ఒక డ్వాక్రా గ్రూప్, లేదా ఒక రైతులు సంఘం, స్కూల్స్, వాకర్ క్లబ్, లయన్స్ క్లబ్, యువజన సంఘం, ఇలా ఒక గ్రూపుగా ఏర్పడాలి. తరువాత జిల్లాలోని నీటిపారుదల శాఖ ఆఫీస్‌లో వుండే జిల్లా స్థాయి అధికారికి పోలవరం యాత్ర గురించి తెలియచేస్తూ, బస్సు సదుపాయం కల్పించమని దరఖాస్తు చెయ్యాలి. నీటి పారుదల జిల్లా అధికారి సమీపంలోని ఆర్ టి సి డిపోకి సదరు సంఘం లేదా సంస్థకి బస్సు సదుపాయం కల్పించమని ఆదేశాలు జారీ చేస్తారు.

polavaram 29062018 3

నీటి పారుదల శాఖ జిల్లా అధికారి ఇచ్చిన సిఫార్సులేఖని బట్టి మీ సమీపంలోని ఆర్టీసీ డిపోలో సమర్పించి ఉచిత బస్సు పొందవచ్చు. నీటి పారుదలశాఖ జిల్లా అధికారికి మీ ప్రయాణ తేదీని ముందే తెలియచేసినట్లయితే, వారు పోలవరం సైట్‌లో వున్న నీటిపారుదల విభాగానికి ఫలానా రోజు ఫలానా డిపో బస్సు వస్తుంది అని ముందే తెలియచేస్తారు. అప్పుడు మీకు సైట్ దగ్గర క్యాంటీన్ లో భోజన సదుపాయం ఉచితంగా లభిస్తుంది, లేనిచో ఉచిత భోజన సదుపాయం లభించదు. ఈ ప్రొసీజర్ అంతా మనకి ఎందుకు అంటారా..? మనమే డబ్బు పెట్టుకుని ప్రైవేట్ వాహనాలలో వెళ్ళొచ్చు. ప్రైవేట్ వాహనాలని సైట్ లో చూడటానికి అనుమతిస్తారు. సైట్ కాంటీన్ దగ్గర పెయిడ్ భోజనం ఉంటుంది.

polavaram 29062018 2

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వైపు నుంచి వచ్చేవారు రాజముండ్రి వచ్చి అక్కడ నుంచి రోడ్ కం రైల్ బ్రిడ్జ్ మీదగా కొవ్వూరు వచ్చి, కొవ్వూరు, చిదిపి, కుమారదేవం, తాళ్లపూడి, తాడిపూడి, గూటాల, పట్టిసీమ, పోలవరం, మీదుగా పోలవరం డ్యామ్ చేరుకోవచ్చు. కొవ్వూరు నుంచి పోలవరం 28 కిలోమీటర్లు అక్కడ నుంచి డ్యామ్ 10 కిలోమీటర్లు ఉంటుంది. విజయవాడ వైపు నుంచి వచ్చే వారు, విజయవాడ, గుండుగొలను, బీమడోలు, నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం, తాళ్లపూడి, తాడిపూడి, గూటాల, పట్టిసీమ, పోలవరం మీదగా పోలవరం డ్యామ్ చేరుకోవచ్చు. విజయవాడ నుంచి దేవరపల్లి 130 కిలోమీటర్లు, దేవరపల్లి నుంచి గోపాలపురం 10 కిలోమీటర్లు, గోపాలపురం నుంచి తాళ్లపూడి 15 కిలోమీటర్లు, తాళ్లపూడి నుంచి పోలవరం 15 కిలోమీటర్లు, ఖమ్మం నుంచి వచ్చేవారు సత్తుపల్లి, అశ్వారావుపేట, జిలుగుమిల్లి, కన్నాపురం, గోపాలపురం, తాళ్లపూడి, తాడిపూడి, గూటాల, పట్టిసీమ, పోలవరం మీదుగా పోలవరం డ్యామ్ చేరుకోవచ్చు. ఖమ్మం నుంచి గోపాలపురం 170 కిలోమీటర్లు ఉంటుంది. గోపాలపురం నుంచి తాళ్లపూడి 15 కిలోమీటర్లు, తాళ్లపూడి నుంచి పోలవరం 15 కిలోమీటర్లు.

ఏమి ఏమి చూడాలి ?? * పట్టిసీమ పంప్ హౌస్ : ఇది గోదావరి నది ఒడ్డున నిర్మించారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 14 అడుగులు ఉంటేనే ఇక్కడ పంపుల ద్వారా నీరు తోడగలుగుతారు. * పట్టిసీమ డెలివరీ పాయింట్: పట్టిసీమ పంప్ హౌస్ కి, డెలివరీ పాయింట్ కి మధ్య 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పట్టిసీమ నుంచి పోలవరం వచ్చి, పోలవరం నుంచి లెఫ్ట్ వైపు 3 కిలోమీటర్లు వెళ్తే పట్టిసీమ డెలివరీ పాయింట్ వస్తుంది. పంపు హౌస్ లో తోడిన నీరు డెలివరీ పాయింట్ లో నుంచి బయటకి వస్తాయి. * పోలవరం కుడి కాలవ టన్నెల్స్: పోలవరం నుంచి విజయవాడ వైపు వచ్చే కాలవ కోసం ఒక కొండలోనుంచి రెండు టన్నెల్స్ నిర్మిస్తున్నారు ఇవి చూడాలి. * పోలవరం సైట్ మ్యాప్: సైట్ లో ప్రధాన ఇంజనీర్ కార్యాలయంలో ఇది ఏర్పాటు చేసారు. ఇది చూడటం వల్ల మనకి పూర్తి అవగాహనా వస్తుంది. * వ్యూ పాయింట్: ప్రాజెక్ట్ ని పూర్తిగా చూసేందుకు వ్యూ పాయింట్ ఉంది. ఇది సముద్ర మట్టానికి 150 అడుగుల ఎత్తులో కొండ మీద వుంది. ఇక్కడ నుంచి పూర్తిగా ప్రాజెక్ట్ కనిపిస్తుంది. * స్పిల్ వే, దయాఫ్రొమ్ వాల్, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్, కాఫర్ డ్యామ్, విద్యుత్ కేంద్రం చూడటంతో పోలవరం సైట్ సందర్శన పూర్తవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read