రాజధానిలోని లింగా యపాలెం- కొండమరాజుపాలెంల మధ్య జపాన్‌కు చెందిన కునిఉమి సంస్థ, సీఆర్డీయే సంయుక్తంగా నిర్మించనున్న హ్యూమన్ ఫ్యూచర్ పెవిలియన్ భవంతికి కునిఉమి సంస్థ అధ్యక్షుడు యమజాకి యసుయో, సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా ఈ నిర్మాణ విశేషాలను యసుమో శ్రీధర్‌కు వివరించారు. 2 ఎకరాల ప్రాంగణంలో, 1,000 చదరపు మీటర్లలో 6 మీటర్ల ఎత్తుతో దీనిని నిర్మిస్తామని, భవంతి మొత్తాన్ని పేపర్ కోర్ కోటెడ్ విధానంలో వాడేసిన కాగితంతో రూపొందించిన స్తంభాలపై, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ సామగ్రితో రూపొందిస్తామని పేర్కొన్నారు.
ఇందులో జపాన్ సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శన శాలతోపాటు 700 మంది కూర్చునేందుకు వీలైన హాలును నిర్మిస్తామన్నారు. ప్రదర్శన శాలలో విశ్వాన్ని ప్రతిబింబించే గోళం (గ్లోబ్) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. దీనిని సందర్శకులు తాకి, తాము కోరుకున్న ప్రాంతాన్ని జూమ్ చేసి, చూసుకోగలిగే వీలుంటుందన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రజలకు పరిచయం చేసేందుకు సందర్శకుల హాలును వినియో గించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు మండ లాధ్యక్షురాలు వడ్లమూడి పద్మలత, సీఆర్డీయే ల్యాండ్స్ డైరెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు, సీఈ ఎం.జక్రయ్య, ఎస్.ఇ. సీహెచ్ ధనుంజయ, సీసీడీపీ జేడీ ఎం.ఎ.క్యు.జిలానీ, కునిఉమి సంస్థ ఉపాధ్యక్షుడు అఖిలేష్‌కుమార్, ప్రాజెక్ట్ మేనేజర్ అకి ఇచిజుకా, భవంతి ఆర్కిటెక్ట్ సొంకె హూఫ్, బి.ఎస్.చక్రవర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అమరావతిని భవిష్యత్తులో సందర్శించే జపాన్ దేశ ప్రజలతోపాటు మన దేశీయులనూ అలరించేలా రూపొందబోతున్న ఈ పెవిలియన్ డిజైన్‌ను జపాన్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ షిగురు బన్ రూపొందించారు. పలు సుప్రసిద్ధ కట్టడాల ఆకృతులను రూపొందించిన షిగురు ఆర్కిటెక్చర్‌లో నోబెల్ బహుమతిగా అభివర్ణించదగిన ప్రిట్జ్‌కర్ ఆర్కిటెక్చర్ పురస్కార గ్రహీత! విశాలంగా, ప్రశాంతతకు నెలవుగా ఉండబోయే ఈ పెవిలియన్‌ను జపాన్‌కే చెందిన కుని ఉమి అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్మించబోతోంది.