ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలించింది... శ్రీకాకుళం జిల్లా నేతలు, అధికారుల శ్రమ వృధా కాలేదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో వంశధార పనులు జోరుగా కొనసాగిస్తున్న వేళ, మరో మంచి పరిణామం చోటు చేసుకుంది.. వంశధార నది పై నేరడి వద్ద బ్యారేజి అనుమతి ఇవ్వటం శ్రీకాకుళం జిల్లా వాసుల్లో ఆనందం నింపింది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి, చంద్రబాబు ప్రభుత్వానికి ఇదే తేడా... అధికారులకి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ, బలమైన వాదనలు వినిపిస్తూ, ఐదున్నర దశాబ్దాల తరువాత విజయం సాధించారు..
ఒడిషా సరిహద్దుల్లో దశాబ్దాల తరబడి నెలకొన్న నేరడి ప్రాజెక్టు విషయంలో ట్రిబ్యునల్ తుది తీర్పు చెప్పింది. ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్మించుకోవచ్చునని ట్రిబ్యునల్ తుది తీర్పు చెప్పింది. ప్రాజెక్టుకు అవసరమైన భూమిని ఒడిషా ప్రభుత్వం సేకరించాలని చెప్పింది. నలుగురు సభ్యులతో పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో దశాబ్దాలుగా నెలకొన్న వివాదానికి తెరబడింది. నేరడి ప్రాజెక్టు పూర్తి అయ్యేంతవరకు, అంతకుముందున్నటువంటి కాట్రగడ్డ సైడ్ వ్యూవర్ నిర్మాణానికి కూడా ట్రిబ్యునల్ అంగీకరించింది.
గొట్టా బ్యారేజీ వద్ద 115 టీఎంసీల నీటి లభ్యత ఉందని లెక్కగట్టిన ట్రైబ్యునల్, ఈ నీటిని ఏపీ, ఒడిసా రాష్ట్రాలు 50: 50 నిష్పత్తిలో సమానంగా వాడుకోవాలని సూచించింది. నేరడి బ్యారేజీ ద్వారా ప్రతియేటా జూన్ 1 నుంచి నవంబరు 30 వరకు.. అంటే మొదటి పంట కాలంలో నీటిని తోడుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌కు ట్రైబ్యునల్ అనుమతి ఇచ్చింది.
బ్యారేజీ నిర్మాణానికి సమయం పడుతుంది కాబట్టి ఈలోగా నీటిని తోడుకోవడానికి కాట్రగడ్డ దగ్గర సైడ్వేవియర్ నిర్మించుకోవడానికి ఏపీకి అనుమతి ఇచ్చింది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్రకు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లావాసులకు సుమారు 50 టీఎంసీల నీరు అందుబాటులోకి రానుంది. సుమారు 2.55 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.