రాష్ట్రంలో ఏంజరుగుతోందో డీజీపీకి తెలుస్తోందా లేక, ఆయనతో పని లేకుండానే కింది స్థాయి పోలీసులు వారి ఇష్టానుసారం పని చేస్తున్నారా అనే సందేహం ప్రజలందరికీ కలుగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. గురువారం సాయంత్రం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా మీకోసం...! మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుని ప్రభుత్వం తప్పుడు కేసులతో జైలుకు పంపించింది. హైకోర్ట్ బెయిలివ్వడంతో ఆయన ఈరోజు జైలు నుంచి బెయిల్ పై విడుదలైతే ప్రభుత్వం ఆయన్ని, ఆయన వాహనశ్రేణిని అడ్డుకోవడమేంటి? జైల్లోలేని స్వేచ్ఛను బయటకూడా లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోందా? దేవినేని ఉమ బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడనివ్వలేదు. అక్కడా పోలీసులతో ఆంక్షలుపెట్టారు. ఆయన విజయవాడకు వస్తుంటే, ఎందుకు దారి పొడవునా అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారు? దేవినేని ఉమా అభిమానుల, టీడీపీ కార్యకర్తల కార్లకు లారీలు అడ్డపెట్టి మరీ పోలీసులు గండుగొలను వద్ద ఎందుకు ఆపారు? ఏమిటీ దుర్మార్గం? డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేల వాహానాల వెంట వాహనాలుంటే, దాన్ని ప్రోటోకాల్ అంటారా? ప్రతిపక్ష నేతల వాహన శ్రేణిలో రెండు, మూడు కార్లుంటే అది చట్టవిరుద్ధమా? జగన్మోహన్ రెడ్డి గతంలో జైలునుంచి విడుదలైనప్పుడు భారీ కాన్వాయ్ తో, ఎందుకు ఏదో సాధించినట్లు విజయోత్సవాలు నిర్వహించారు? ఆనాడు మీరు చేసింది ఒప్పయితే, ఈనాడు దేవినేని ఉమా చేసింది తప్పెలా అవుతుంది? ఆయనేమీ మీకులాగా కిరాయికి అభిమానాన్నితెచ్చుకోలేదు. కృష్ణాజిల్లాలోని ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు దేవినేనిని అమితంగా అభిమానిస్తారనడానికి నేడు, ఆయనకు లభిస్తున్న ఘనస్వాగతమే నిదర్శనం.
దేవినేని ఉమాని అడ్డుకోమని డీజీపీ చెప్పలేదని చెబితే, స్థానిక జిల్లా ఎస్పీపై తాము ప్రైవేట్ కేసు వేస్తాం. జైలు నుంచి బయటకు వస్తే, ఎవరితో మాట్లాడకూడదా? ఏ గుడిలోనూ దర్శనానికి కూడా వెళ్లకూడదా? దేవినేని ఉమా పూజలు చేస్తాడని తెలిసి, హనుమాన్ జంక్షన్ గుడిని మూయిస్తారా? ఏమిటీ దుర్మార్గం. ప్రభుత్వం గుడి మూయించే స్థాయికి దిగజారిపోవడం నీచాతినీచం. ప్రభుత్వం, పోలీసులు ఎందుకింత దిగజారి ప్రవర్తిస్తున్నారు? ఈరోజు దేవినేని ఉమా కారుని, ఆయన అభిమానుల కార్లను అడ్డుకున్నారు, కానీ రేపు కోర్టు నుంచి అనుమతి తీసుకొని విజయవాడలో భారీ కాన్వాయ్ తో తిరిగితే ఏం చేస్తారు? డీజీపీ తన వ్యవస్థ పరువుని తానే తీసుకుంటున్నాడు. కోర్టులు మొట్టికాయలు వేసినా, ఆయనతన తీరు మార్చుకోకపోతే ఎలా? ముఖ్యమంత్రి, డీజీపీలు వారి పదవులు శాశ్వతం కావని తెలుసుకుంటే మంచిది. దేవినేని ఉమాని ప్రభుత్వమే సురక్షితంగా విజయవాడలోని ఆయన నివాసానికి చేరిస్తే మంచిది. లేకుంటే ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత. జాతీయ రహదారిపై లారీలు అడ్డంపెడితే ఏంచేశారు? పోలీసులు దానిపై ఏం చర్యలు తీసుకున్నారు? లారీలు అడ్డంపెట్టి, ఉమా కారుని ఒక్కదాన్నే ఎందుకు ఆపారు? మిగిలినవాటిని ఎందుకు ఆపేశారు? దేవినేని ఉమా జైలు నుంచి విడుదలై, తన మానాన తాను ఇంటికి వెళ్లిపోయేవాడు. అలా కాకుండా ఇలాంటివన్నీ చేసి, ప్రభుత్వమే సీన్ క్రియేట్ చేస్తోంది.