రాష్ట్రంలో మరో భారీ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు కానుది. దాదాపు 7వేల ఎకరాల్లో రూ.9వేల కోట్ల పెట్టుబడితో అతిపెద్ద హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టు ప్రారంభించడానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకూ సౌర, పవన, థర్మల్... ఇలా విద్యుత్ ప్రాజెక్టులను విడివిడిగానే ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఒకేచోట సోలార్, పవన విద్యుదుత్పత్తి జరిగేలా కర్నూలు- కడప జిల్లాల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి రెండు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టు అవుతుందని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న జనరల్ ఎలక్ర్టిక్(జీఈ) కంపెనీ, మరో కంపెనీ సంయుక్తంగా దీని ఏర్పాటుకు ముందుకొచ్చినట్లు తెలిసింది.
దీనికి అవసరమైన భూమిని కూడా ఆయా కంపెనీలే సమకూర్చుకుంటాయి. అయితే దానిమధ్యలో ప్రభుత్వ భూమి ఉంటే అది మాత్రం ఇవ్వాల్సి ఉంటుందనే దిశగా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపితే పెట్టుబడి పెట్టేందుకు ఆ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఇది అత్యంత భారీ ప్రాజెక్టు కావడంతో సీఎం చంద్రబాబు స్వయంగా దీనిపై దృష్టి పెట్టారని తెలిసింది. ఇంత భారీ ప్రాజెక్టు ఏర్పాటైతే కడప-కర్నూలు జిల్లాల అభివృద్ధికి మరింతగా ఉపయోగపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కర్నూలు జిల్లా అవుకు, కడప జిల్లా మైలవరం ప్రాంతాల్లో దీని ఏర్పాటుకు సదరు కంపెనీలు సుముఖత చూపించాయని సమాచారం. ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని సమాచారం.