అంతా అనుకున్నట్టే జరుగుతుంది. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ప్రజల ఏపీకి వచ్చి ఓటు వేసే అవకాశం ఉందని తెలియటం, వాళ్ళలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అని తెలియటంతో, అక్కడ నుంచి ప్రజలు రాకుండా, ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటికే హైదరాబాద్ నుంచి వచ్చే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, 10 సాయంత్రం రద్దు అయినట్టుగా, బుక్ చేసుకున్న వారికి మెసేజ్ లు వచ్చాయి. రేపటి లోపు చాలా బస్సులు ఇలాగే రద్దు చేస్తారనే సమాచారం రావటంతో, హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చే వారిని రప్పించటానికి తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఒకరోజు ముందు రాత్రి నుంచి ఎన్నికల రోజు మధ్యాహ్నం వరకు ఓట్లు వేసేందుకు జనం తరలి వెళుతుంటారు. వారి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
మరో పక్క, రవాణా శాఖ అధికారులను అడ్డం పెట్టుకుని ఏపీ వెళ్లే ప్రైవేటు బస్సులను అడ్డుకునే అవకాశం ఉందని ఆంధ్రా ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్మిట్ లేదని, ఫిట్‌నెస్ లేదని, నిబంధనలు పాటించడం లేదని.. ఇలా ఏదో ఒక సాకుతో బస్సులను మధ్యలోనే ఆపివేసే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. దీంతో వీలైనంత ముందుగానే సొంతూర్లకు చేరుకునేందుకు ఏపీ ఓటర్లు ప్లాన్ మార్చుకుంటున్నారు. ఒకవేళ ప్రైవేటు బస్సులను మధ్యలోనే అడ్డుకుంటే.. సకాలంలో వెళ్లి ఓటేసేలా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈ నెల 11న ఏపీలో ఓటు వేసేందుకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నుంచి లక్షలాది మంది సొంతూర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 10లక్షల మంది తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరిలో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు.